సాధన చేయాలి : నటనపై అనుపమ్‌ఖేర్
నటన అనేకమందికి సహజంగా వస్తుందని, అయితే దానిని నేర్చుకోవడంతోపాటు సాధన చేయాల్సిన అవసరం కూడా ఉందని అగ్ర నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనుపమ్‌ఖేర్ పేర్కొన్నాడు. ‘సాధన అనేది నటుడిని మరింత తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుంది. ఇది సైక్లింగ్, మోటార్ డ్రైవింగ్ వంటిది. ఇదొక కళ. మీ జీవితంలో మీరు అనేక హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే వాటినే ఇక్కడ సాధన చేయాల్సి ఉంటుంది’ అని అన్నాడు.
‘మీలోని నటుడిని బయటికి తీసుకొస్తామనేదే మా నినాదం. ప్రతి రోజూ మనిషి మెదడు అనేక సంకేతాలను పంపుతుంది. అయితే నటనలో అటువంటి సంకేతాలు ఏమీ ఉండవు. మిమ్మల్ని మీరు గొప్పగా చూపుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. మా స్కూల్ మిమ్మల్ని మంచి నటుడిగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎవరు బాగా నటించగలుగుతున్నారనే విషయం తెలిసేవిధంగా చేస్తుంది. అంతేకాకుండా చక్కని క్రమశిక్షణ నేర్పుతుంది. ఎలా జీవించాలో కూడా తెలియజేస్తుంది’ అని అన్నాడు.
కాగా ఖేర్ ఓ యాక్టింగ్ స్కూల్‌ను నడుపుతున్నాడు. కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తున్న యురేకా ప్రొడక్షన్స్ సంస్థ సహకారంతో ఖేర్ స్కూల్ ప్రపంచంలోని గొప్ప గొప్ప పాఠశాలలపై ‘స్కూల్స్ లైక్ నో అదర్స్’ పేరిట కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. ఈ పాఠశాలను అనుపమ్ ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. దీనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ విషయమై ఖేర్ మాట్లాడుతూ ఈ పాఠశాలకు మంచి గుర్తింపు రావడం వ్యక్తిగతంగా తనకే కాకుండా, దేశానికి కూడా గొప్ప గౌరవమన్నాడు.
కేవలం ఎనిమిది సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప అనుభూతిగా అభివర్ణించాడు. సారాంశ్, డాడీ, కర్మ, డర్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, మైనే గాంధీకో నహీ మారా వంటి వాణిజ్య సినిమాల్లో అనుపమ్ తన అద్భుత నటనాశైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా బెండ్ ఇట్ లైక్ బెఖమ్, బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ వంటి ఆంగ్ల సినిమా ప్రాజెక్టుల్లోనూ అనుపమ్ భాగస్వామే. ఇటీవల ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ అనే ఆంగ్ల సినిమాలోనూ నటించాడు అనుపమ్.