పెరంబూరు: నా విషయంలో ఒక తల్లి ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. అమ్మా నీకో దండం అని నటి సంగీత ఆవేదనను వ్యక్తం చేశారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన సంగీతపై ఆమె తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా పోలీస్ కమిషన్‌లో ఫిర్యాదు చేసి కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. తన కూతురు తన ఇంటిని అపహరించడానికి ప్రయత్నిస్తోందని, అవసాన దశలో ఉన్న తనను ఇంటి నుంచి బయటకు పొమ్మంటోంది లాంటి ఆరోపణలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నటి సంగీతకు నోటీసులు జారీ చేయడం, ఆమె తన భర్త క్రిష్‌తో కలిసి పోలీస్ కమిషనర్ ముందు హాజరవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సంగీత తన తల్లిపై ఆరోపణలు గుప్పిస్తూ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
అందులో ప్రియమైన అమ్మకు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా పాఠశాల చదువును నిలిపేసి 13 ఏళ్లకే పనికి పంపావే అందుకు కృతజ్ఞతలు. ఖాళీ చెక్కులపై నీవు చెప్పినట్టల్లా సంతకాలు చేయించుకున్నావే అందుకు కృతజ్ఞతలు. పనికే వెళ్లకుండా, శ్రమ అన్నది తెలియని నీ కొడుకులకు మద్యం కోసం, డబ్బు కోసం నన్ను తప్పుడు పనులకు వాడుకున్నావే అందుకు కృతజ్ఞతలు. అందుకు నేను వ్యతిరేకించినప్పుడు సొంత ఇంటిలోనే నిర్భంధించావే అందుకూ కృతజ్ఞతలు. నేను గొడవ చేసి బయటకు వచ్చే వరకూ నాకు పెళ్లి చేయలేదే అందుకూ కృతజ్ఞతలు. నా భర్తపై ఒత్తిడి చేశావు, నా కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసినందుకూ చాలా చాలా కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో అలాంటి చేసి నాకు ఉదాహరణగా ఉన్నావు అందుకూ కృతజ్ఞతలు. చివరిగా నాపై అసత్యపు ఫిర్యాదు చేశావు అందుకూ కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు ఒక మైనముద్రలో ఉన్న నన్ను పోరాడే ధైర్యవంతురాలిగా మారడానికి, ఆరితేరడానికి కారణం అయ్యావు. ఈ ఒక్క కారణంగానే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనూ ఉంటాను. మోహం నుంచి నువ్వు ఒక రోజు బయటపడి నన్ను చూసి గర్వపడతావు అని నటి సంగీత పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment