ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం | Allu Arjun-Sukumar's 'I Am That Change' to be out to night | Sakshi
Sakshi News home page

ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం

Published Thu, Aug 14 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం

ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం

 ‘‘సమాజానికి మంచి చేయాలని అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సేవ చేస్తూనే ఉంటారు. నేను సినిమా వాణ్ణి. సినిమా తప్ప నాకు మరొకటి తెలీదు. అందుకే... సినిమా ద్వారానే సమాజానికి ఉపయోగపడే మంచిని చెబుదామనుకున్నాను. ఆ చిరు ప్రయత్నమే... ‘ఐ యామ్ దట్ ఛేంజ్’’’ అని అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి, నిర్మించిన లఘు చిత్రం ‘ఐ యామ్ దట్ ఛేంజ్’. గురువారం హైదరాబాద్‌లో మీడియాకు ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు.
 
  ‘‘భవిష్యత్ తరాల కోసం ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగఫలమైన మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ స్పృహను భావితరాలకు అందించాలనే సంకల్పంతో చేసిన లఘు చిత్రమిది. నీతులు చెబితే వినే దశలో నేటి యువత లేరని నాకు తెలుసు. ఎందుకంటే... ఓ బిడ్డకు తండ్రినైనా నేనూ యూతే. ఈ లఘు చిత్రం ద్వారా సమాజానికి సేవ చేయమని నేను చెప్పలేదు. మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తే అదే సమాజ సేవ అవుతుందని చెప్పాను’’ అని అల్లు అర్జున్ చెప్పారు. దర్శకుడు సుకుమార్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘రెండ్రోజుల్లో మనం ఓ లఘు చిత్రం చేయనున్నామని సుకుమార్‌కి చెప్పాను.
 
  అంతే... వెంటనే కాన్సెప్ట్ కూడా ఆయనే తయారు చేసి ఓ బాధ్యతగా చేసిపెట్టారు. ఆయన స్థాయి దర్శకుడు ఇలాంటి లఘు చిత్రం చేయాలంటే పాతిక లక్షలు తీసుకుంటారు. కానీ... పైసా తీసుకోకుండా చేసిపెట్టారు. అలాగే కెమెరామ్యాన్ అమోల్ రాథోడ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీత దర్శకుడు సాయికార్తీక్ - ఇలా అందరూ సహకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ లఘుచిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలని, ఇలాంటి మంచి లఘు చిత్రానికి దర్శకుణ్ణి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని సుకుమార్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement