
కన్నడంలోకి అమలాపాల్
అమలాపాల్ ఈ పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం మైనా. ఒక ప్రేమికురాలిగా అంతగా ఆ చిత్రంలోని పాత్రలో ఒదిగిపోయి నటించారామె. ఆ చిత్రం తరువాత అమలాపాల్ స్టార్ హీరోయిన్ అయిపోయారు. తమిళంలో విజయ్, విక్రమ్ అంటూ ప్రముఖ నటులతో నటించే స్థాయికి చేరుకున్నారు.అంతే కాదు మలయాళీ కుట్టి అయిన అమలాపాల్ తన నటనను టాలీవుడ్‌కు విస్తరించుకున్నారు.
అక్కడ రామ్‌చరణ్, నాగచైతన్య వంటి ప్రముఖ యువ నటుల సరసన నటించి గుర్తింపు పొందారు.అలా మూడు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవడం ఆమెకు సంతోషమే అయినా తన అభిమానులకు మాత్రం షాక్ అనే చెప్పాలి. అయితే చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమై అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు.
వివాహానంతరం ఆచీతూచీ చిత్రాలను అంగీకరిస్తున్న అమలాపాల్‌కు రీఎంట్రీ సూపర్‌గా అమరింది. నటుడు సూర్య సొంతంగా నిర్మించి నటించిన పసంగ-2 చిత్రంలో ఆయన సరసన నటించి సక్సెస్‌ను అందుకున్నారు.ప్రస్తుతం నటుడు ధనుష్ నిర్మిస్తున్న అమ్మ కణక్కు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
దీంతో ఇప్పుడు కన్నడ చిత్రం రంగ ప్రవేశం చేస్తున్నారు. కన్నడంలో కిచ్చా సుదీప్‌కు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. హబ్బులి అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కృష్ణ అనే దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. అలా అమలాపాల్ మలయాళం, తమిళం, తెలుగు, తాజాగా కన్నడం అంటూ దక్షిణాది భాషలను చుట్టేస్తున్నారు.