మనిషి గుణ రాగం అంధాధున్‌ | Andhadhun movie review | Sakshi
Sakshi News home page

మనిషి గుణ రాగం అంధాధున్‌

Published Sun, Oct 7 2018 5:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Andhadhun movie review - Sakshi

ఏదీ టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌ కాదు.. మన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది... అంధాధున్‌ సినిమా ఫిలాసఫీ ఇదే! ఎవరి కోసం ఎవరూ ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. మనుషుల్లోని ఈ కోణానికే 24 క్రాఫ్ట్స్‌ను అద్ది తెరమీద ప్రెజెంట్‌ చేశాడు దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌. ‘బదలాపూర్‌’ (ఆయన తీసినదే) సినిమా బిగినింగ్‌లాగే ‘అంధాధున్‌’ బిగినింగ్‌ కూడా మిస్‌ కాకూడదు. ఈ బిగిని తగిన వ్యవధి వరకూ లాగాడు కాని సినిమా ప్రారంభంలో వేసిన టైటిల్స్‌లో ‘‘లైఫ్‌.. డిపెండ్స్‌ ఆన్‌  ఇట్స్‌  లివర్‌’’ ముక్కకే  సాగదీస్తే కానీ కనెక్టివిటీ దొరకలేదు. అయినా ఉత్కంఠ తగ్గదు. అంత టైట్‌గా ఉంది స్క్రీన్‌ప్లే.

కథ..
సంగీత కళాకారులకు జ్ఞానేంద్రియ లోపం శాపం కాదు.. ఏకాగ్రతను కుదిర్చే వరం! అందుకే బెథోవెన్‌ సంగీతబ్రహ్మ అయ్యాడు. సరిగ్గా ఈ పాయింట్‌ దగ్గరే తన ప్రయాణాన్నీ మొదలుపెడ్తాడు ఆకాశ్‌ (ఆయుష్మాన్‌ ఖురానా). అయితే గుడ్డివాడిగా! అతను పియానో వాద్యకారుడు. అద్భుతమైన ట్యూన్‌తో టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని .. తర్వాత లండన్‌ వెళ్లిపోయి స్వరప్రయోగాలతో కాలక్షేపం చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ ఆశను నెరవేర్చుకునే దిశలో అనూహ్య మలుపుల్లో చిక్కుకుంటాడు. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త ఆపదలను ఎదర్కొంటుంటాడు. అన్నిటినీ జయించుకుంటూ అనుకున్నది సాధిస్తాడా? గుడ్డివాడిగానే మిగిలిపోయి అంధాధున్‌ (గుడ్డి రాగం) పాడుకుంటాడా? ఎండ్‌ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే! ఈలోపు కొన్ని సీన్స్‌ గురించి తెలుసుకుందాం.

కథా ప్రదేశం.. పుణె. మధ్య తరగతివాళ్లుండే ప్రభాత్‌ నగర్‌లో ఉంటుంటాడు హీరో. సంగీతం మీద కాన్‌సంట్రేషన్‌ కుదరడానికి గుడ్డితనాన్ని టూల్‌గా వాడుకుంటాడు. ఒకరోజు యాక్సిండెటల్‌గా.. లిటరల్లీ యాక్సిడెంటల్‌గానే కలుస్తుంది సోఫీ (రాధికా ఆప్టే). ఆమె ఓ క్లబ్‌ ఓనర్‌ కూతురు. ఆ యాక్సిడెంట్‌లోనే ఆకాశ్‌ పియానో ప్లేయర్‌ అని తెలుస్తుంది. తమ క్లబ్‌కి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆ క్లబ్‌లో పియానో వాయించే ఉద్యోగం ఇస్తాడు ఆమె తండ్రి.  ఆ రోజు సాయంకాలం సోఫీ .. ఆకాశ్‌ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తుంటే.. నల్ల కళ్లజోడు తీసి సోఫీని చూస్తాడు ఆకాశ్‌. ఆ విషయాన్ని ఆ ఇంటి కింద ఉన్న ఓ పిల్లాడు గ్రహిస్తాడు. సహజంగా ఆ పిల్లాడు ఆకాశ్‌ను ఏడిపిస్తుంటాడు గుడ్డివాడని.

సంగీతం.. సాగనంపడం
అలా సోఫీ వాళ్ల క్లబ్‌లో ఆకాశ్‌  పాత పాటలకు ఫిదా అవుతాడు రియల్టర్‌గా మారిన మాజీ హీరో ప్రమోద్‌ సిన్హా (ఆనంద్‌ ధవన్‌). తెల్లవారి వాళ్ల మ్యారేజ్‌ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు. తన భార్యకు ఇష్టమైన రాజేశ్‌ ఖన్నా పాటలు వినిపించాలని అడుగుతాడు. సరేనని తెల్లవారి ప్రమోద్‌ సిన్హా చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు ఆకాశ్‌. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమీ  సిన్హా (టబు).

గుమ్మంలోనే చాలా సేపు మాట్లాడుతుంటుంటే.. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తలుపు తెరిచి చూస్తుంది. ఇబ్బందిగా ఫీలయ్యి ఆకాశ్‌ను లోపలికి రమ్ముంటుంది సిమీ. ఇంట్లోకొచ్చిన ఆకాశ్‌కు హాల్లో ఉన్న పియానో చూపిస్తుంది సిమీ. కచేరీ మొదలుపెడ్తాడు ఆకాశ్‌. పియానో మెట్ల మీద వేళ్లను పరిగెత్తిస్తుంటే  రక్తం, లిక్కర్‌ కలిసిన మడుగు.. ఓ మనిషి కాళ్లూ అతని కంటబడ్తాయ్‌. ఆ ఇంటి యజమాని  ప్రమోద్‌సిన్హా హత్య జరిగిందని తెలుస్తుంది. అయినా గుడ్డిగా ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి సెలవు తీసుకొని సరాసరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తాడు ఆకాశ్‌.

తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్‌స్పెక్టర్‌ సిమీ సిన్హా  బాయ్‌ఫ్రెండే అని తేలుతుంది. గతుక్కుమంటాడు.  ఆ ఇన్‌స్పెక్టరూ సిమీ వాళ్లింట్లో ఆకాశ్‌ను చూస్తాడు.  అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు. ఆ విషయం సిమీకి  చెప్పి వాకబు చేయమంటాడు. ఈలోపు పోలీస్‌ ఎంక్వయిరీలో ప్రమోద్‌ సిన్హా హత్య వెనక సిమీ సిన్హా హస్తం ఉందనే డౌట్‌ను పోలీసుల ముందు క్రియేట్‌ చేస్తుంది ఎదురింటి ఆవిడ. ఈ విషయం సిమీకి తెలిసి ఆ ముసలావిడను బిల్డింగ్‌ మీద నుంచి తోసి చంపేస్తుంది. యాదృచ్చికంగా దీనికీ  సాక్షిగా నిలుస్తాడు ఆకాశ్‌.  ఈ సంఘటనతో  ఆకాశ్‌ కంటి చూపు మీద సిమీకీ సందేహం వస్తుంది. నివృత్తి చేసుకోవడానికి ఆకాశ్‌ వాళ్లింటికి వెళ్తుంది. గుడ్డివాడు కాదని రుజువవుతుంది.

స్వీట్‌తో విషప్రయోగం చేసి ఆకాశ్‌ చూపు నిజంగానే పోయేలా చేస్తుంది. ఈలోపు సోఫీ ఆకాశ్‌ వాళ్లింటికి వస్తుంది. ఆకాశ్‌ అంధుడు కాదు అని అందరికన్నా ముందు అనుమాన పడ్డ ఆకాశ్‌ ఇంటి దగ్గరి కుర్రాడు.. ఆకాశ్‌ వీడియో తీస్తాడు అతనికి చూపు ఉంది అని నిరూపించడానికి. సోఫీ వచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాడు. ఆకాశ్‌ తనను మోసం చేశాడనే కోపం, ఉక్రోషంతో గదికి వెళ్తుంది. అక్కడ సిమీ కనపడుతుంది. అవాక్కవుతుంది సోఫీ. ఆకాశ్‌ పడుకొని ఉంటాడు. ఆ గది వాతావరణం, సిమీ ప్రవర్తనను బట్టి వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకొని ‘‘ఆకాశ్‌కి ఇన్ఫామ్‌ చేయండి .. మా నాన్న పియానో అమ్మేశాడు. క్లబ్‌లో అతనికిక ఉద్యోగం లేదని’’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సోఫీ. ఇక్కడ ఆ పాత్ర పాజ్‌ తీసుకుంటుంది.

తర్వాత...
ఆకాశ్‌కి చూపు పోయినంత మాత్రాన నోరుంది కాబట్టి తమ నేరాన్ని బయటకు చెప్పే ప్రమాదం ఉందని భయపడ్డ ఇన్‌స్పెక్టర్‌ ఆకాశ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకుని ఓ డాక్టర్‌ చేతిలో పడ్తాడు ఆకాశ్‌. ఆ డాక్టర్‌.. ఆర్గాన్స్‌ అమ్ముకునే వ్యాపారి. అంధుడిగా ఆకాశ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు అతనిని డ్రాప్‌ అండ్‌ పికప్‌ చేసే ఆటోవాలా, ల్యాటరీ టిక్కెట్లు అమ్ముకునే మహిళ.. ఈ ఇద్దరి బ్రోకర్ల సహాయంతో ఆకాశ్‌ కిడ్నీలను అమ్మేయాలని చూస్తాడు డాక్టర్‌.

తెలుసుకున్న ఆకాశ్‌.. సిమీ విషయం చెప్పి ఆమెను కిడ్నాప్‌ చేస్తే కోటి రూపాయలు సంపాదించొచ్చని ఆశ చూపించి ఆపదలోంచి తప్పించుకోవాలనుకుంటాడు. కిడ్నాప్‌కు ప్లాన్‌ చేస్తారు వాళ్లందరూ కలిసి. పోలీస్‌ భార్యకు ఫోన్‌ చేసి ప్రమోద్‌ సిన్హాను హత్య చేసింది మీ భర్తే అని చెప్తారు. సాక్ష్యాలూ ఉన్నాయని, కోటి రూపాయలు ఇవ్వకపోతే మీడియాకు లీక్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. భర్తతో కోటి రూపాయలు పంపిస్తానని ఒప్పుకుంటుంది. ఆకాశ్‌ను కూడా తప్పిస్తే ఆ కోటి రూపాయాలు తామే కొట్టేయొచ్చని పథకం పన్ని ఆకాశ్‌నూ బంధిస్తారు ఆటోవాలా, లాటరీ టిక్కెట్ల మహిళ. కాని పోలీస్‌ చేతిలో మోసపోయి ఆటోవాలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు.

ఇక్కడ మళ్లీ సిమీ.. ఆకాశ్‌ను మోసం చేయాలనుకుంటుంది. ఆర్గాన్స్‌ అమ్మే ప్రాసెస్‌లో సేకరించిన బ్లడ్‌ శాంపుల్స్‌లో సిమీది రేర్‌ బ్లడ్‌ గ్రూప్‌ అని, ఆ గ్రూప్‌తో ఉన్న ఓ దుబాయ్‌ షేక్‌ కూతురికి సిమీ లివర్‌ ఇస్తే కోటి ఏంటి ఆరు కోట్లు సంపాదించొచ్చనే ఆలోచనలో పడ్తాడు డాక్టర్‌. ఆకాశ్‌తోనూ చెప్పి.. లివర్‌ అమ్మేయగా వచ్చిన డబ్బులోంచి కోటి ఇస్తానని, ఆమె కార్నియాతో కళ్లూ తెచ్చుకోవచ్చని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సిమీకి మత్తు మందు ఇచ్చి కారు డిక్కీలో పడేసి, ఆకాశ్‌ను తీసుకొని ముంబై ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాడు డాక్టర్‌. ఆకాశ్‌ వద్దని వారిస్తున్నా వినడు. సిమీకి మళ్లీ మత్తు ఇవ్వడానికి దార్లో కారు ఆపి డిక్కీ దగ్గరకు వెళ్తాడు.

కట్‌చేస్తే..
కారు మళ్లీ స్టార్ట్‌ అవుతుంది. ‘‘సిమీ లివర్‌ అమ్మడం పాపం. జరిగినవేవీ ఎక్కడా చెప్పను. సిమీని, నన్ను వదిలేయండి’’ అని చెప్తుంటాడు ఆకాశ్‌. ఆ మాటలన్నీ వింటూ  మౌనంగా ఏడుస్తూ.. హఠాత్తుగా కారులోంచి ఆకాశ్‌ను దిగిపొమ్మని ఆజ్ఞాపిస్తుంది ఓ స్వరం. ఖంగు తింటాడు ఆకాశ్‌. డాక్టర్‌ ఏమయ్యాడు అని అడుగుతాడు సిమీని. ముందు నువ్వు వెళ్లిపో అంటుంది  డ్రైవింగ్‌ సీట్లో ఉన్న సిమీ. దిగిపోతాడు. సిమీ వెళ్లిపోతుంది. కాస్త ముందుకెళ్లాక నోరుంది కదా.. నమ్మడానికి లేదు అని అనుకొని మళ్లీ వెనక్కు తిప్పుతుంది కారును.. ఆకాశ్‌ను ఢీ కొట్టడానికి. ఇంతలోకే ఆ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో ముంగీస బెడద ఎక్కువవడంతో దాన్ని చంపడానికి గురిపెడ్తాడు చేను కాపలాదారుడు.. అది తప్పించుకుని రోడ్డుకి ఆవలవైపు పరిగెడ్తుంది.. కాపలాదారుడి తుపాకి గురి తప్పి సిమీ కారుకు తగులుతుంది. టైర్‌  బరస్ట్‌ అయి, పల్టీ కొట్టి సిమీ పడిపోతుంది.. కారు పేలిపోతుంది.

రెండేళ్ల తర్వాత..
యూరప్‌లోని ఓ దేశంలోని ఓ క్లబ్‌లో ఆకాశ్‌ పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ రాగాలు  ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అటుగా వెళ్తున్న సోఫీకి .. ఆమె మళ్లీ అప్పియర్‌ అయ్యేది ఇక్కడే. బయట నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న ఆకాశ్‌ ఫోటో, అతని పేరు ఉన్న పోస్టర్‌ చూసి కించిత్‌ ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుంది. పాట అయిపోయాక అందరూ వచ్చి అతని చేతిని స్పృశిస్తూ  అభినందనలు చెప్తుంటారు. అతనూ దానికి స్పందిస్తూ వాళ్ల చేతిని తడుముతూ కృతజ్ఞతలు చెప్తుంటారు. సోఫీ కూడా వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇస్తుంది.. ఏమీ మాట్లాడకుండా. ఆ స్పర్శను గుర్తించి ‘‘సోఫీ’’ అంటాడు ఆకాశ్‌. ‘‘కంగ్రాట్స్‌.. ఇక్కడి వాళ్లనూ ఫూల్స్‌ని చేస్తున్నావన్నమాట’’ అంటుంది. ‘‘అదో పెద్ద కథ.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?’’ అని అడుగుతాడు.

సరేనని కాఫీ షాప్‌కు వెళ్తారు. జరిగిందంతా చెప్తాడు. నిట్టూర్చి.. ‘‘ఎంతమంది జీవితాలతోనో ఆడుకుంది సిమీ? డాక్టర్‌ అన్నట్టు ఆమె కార్నియా తీసుకోవాల్సింది నువ్వు’’ అంటుంది సోఫీ. ‘‘అలా తీసుకుని ఉంటే అపరాధ భావంతో సంగీతానికి దూరమయ్యేవాడిని. బై దవే.. రేపు నా కన్సర్ట్‌ ఉంది.. వస్తావా?’’ అడుగుతాడు. ‘‘రేపు వెళ్లిపోతున్నా. అయినా ట్రై చేస్తా’’ అంటుంది. సరేనని సెలవు తీసుకుంటుండగా.. లోపలి నుంచి వెయిట్రెస్‌ ముంగీస  తలను చెక్కిన చేతికర్రను తెచ్చి ‘‘ఇది  మీదే కదా.. ’’ అంటూ ఆకాశ్‌ చేతికి అందిస్తుంది. ముంగీస బొమ్మ చెవులను తడుముతూ ‘‘అవును నాదే.. థ్యాంక్స్‌’’  అంటూ ఆ కర్ర సహాయంతో క్లబ్‌ బయటకు వస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాళ్లకు అడ్డంగా ఉన్న ఖాళీ కోక్‌ టిన్నును కర్రతో బలంగా కొడ్తాడు. అదెళ్లి  ఆ చివరన పడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆ అంధుడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు.

ది ఎండ్‌..
అనుకోని ట్విస్ట్‌లు.. కథలో కనిపించే ప్రతి పాత్రకూ ఔచిత్యమైన కంటిన్యూటీ.. ప్రేక్షకుల కళ్లు తిప్పుకోనివ్వదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకో నేరం.. దాని నుంచి బయటపడడానికి ఇంకో నేరానికి పాల్పడం..   ఒక పరిస్థితిని ఎవరి స్వార్థానికి వాళ్లు ఉపయోగించుకోవడం..  అవతలి వాడి కష్టాన్ని తమకు లాభంగా మలచుకోవడం..  మనుషుల సామాన్య స్వభావం.  అదే అసలు నైజం. ఇదే ఈ సినిమా పల్స్‌!  అంధాధున్‌ సారాంశం.                             
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement