
సాక్షి, హైదరాబాద్: ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం చల్లారకముందే తెలుగు సినిమా పరిశ్రమలో మరో గొడవ రేగింది. సినీ, టీవీ అవుట్‌డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఆందోళనతో సినిమా షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. నిర్మాత డీవీవీ దానయ్య ఇతర రాష్ట్రాల నుంచి లైట్‌మెన్లను తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లైట్‌మెన్ యూనియన్ నాయకులు గురువారం అడ్డుకున్నారు. వీరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
మరోవైపు కనీస వేతనాలు ఇవ్వకుండా ఎక్కువసేపు పని చేయించుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల వారిని రప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. మూడేళ్లకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమ డిమాండ్ల సాధనకు షూటింగ్‌లను బహిష్కరించామని, తమకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
కనీస వేతనంపై రేపటిలోగా ప్రకటన చేయకుంటే నిరవధిక ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. సినిమా పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సినీ, టీవీ అవుట్‌డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్‌కు భారీగా తరలివస్తున్నారు.