
అనుపమా పరమేశ్వరన్
‘‘నాకు అమ్మాయిలు లేరు. అనుపమా పరమేశ్వరన్ నాకు అమ్మాయిలాంటిది. తను మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తన పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది. ఇదే రోజు మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయిక అనుపమ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. సోమవారం ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో సాయిధరమ్‌తేజ్ జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 20 వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. కె.ఎస్.రామారావుగారు, సాయిధరమ్ సహా యూనిట్‌కు థ్యాంక్స్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. సాయిధరమ్‌తేజ్, దర్శకుడు కరుణాకరన్, సహ నిర్మాత కె.ఎ.వల్లభ, సినిమాటోగ్రాఫర్ అండ్రూస్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు.