
ఆయనకు ఆ హీరోయిన్లే కావాలట!
మార్కెట్‌ను చేజార్చుకున్న నటీనటులు, దర్శకులు మళ్లీ పుంజుకోవాలంటే వారికి ఒక బలమైన ఆధారం అవసరం అవుతుంది.
మార్కెట్‌ను చేజార్చుకున్న నటీనటులు, దర్శకులు మళ్లీ పుంజుకోవాలంటే వారికి ఒక బలమైన ఆధారం అవసరం అవుతుంది. అది హీరోయిన్ కావచ్చు మరెవరైనా కావచ్చు. ఆ మధ్య నటుడు జీవా వరుస అపజయాలతో సతమతం అయ్యారు. ఎలాగైనా కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న దృఢ నిర్ణయంతో చేసిన చిత్రం తిరునాళ్. ఈ చిత్రంలో తనకు జంటగా నయనతారను కోరి మరీ ఎంపిక చేసుకున్నారు.
అందుకు కారణం ఆమె క్రేజ్‌ను వాడుకోవాలన్న ప్రయత్నమేనన్న ప్రచారం జరిగింది. ఏదైతేనేం జీవా తిరునాళ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తదుపరి కవలై వేండామ్ చిత్రంలో కూడా స్టార్ నాయకి కాజల్‌అగర్వాల్‌ను ఎంచుకున్నారు. జీవా మిత్రుడైన ఆర్యకు కూడా అలాంటి టాప్ హీరోయిన్ అవసరం అయ్యారిప్పుడు. ఈయనకు ఇటీవల సరైన హిట్స్ లేవన్నది గమనార్హం. ప్రస్తుతం కడంబన్ అనే చిత్రంలో నటిస్తున్న ఆర్య తదుపరి అమీర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే దర్శకుడిగా అమీర్ మార్కెట్ డౌన్‌లో ఉంది. ఆదిభగవాన్ చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు.
కథానాయకుడిగా మొదలెట్టిన పేరంబు కొండ పెరియవర్‌గళే చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టి ఆర్య హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఆర్యకు జంటగా నయనతార, అనుష్క, తమన్నాలలో ఒకరిని ఎంపిక చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అయితే వారు అనుకుంటున్న హీరోయిన్లు అందరూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో హీరోయిన్ల హీరోగా ప్రచారం పొందిన ఆర్యతో నటించడానికి ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు ముందుకొస్తారన్నది ఆసక్తిగా మారింది.