
1997... బెవర్లీ హిల్స్‌లోని ఓ హోటల్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌తో మీటింగ్ ఉందంటే ఆష్లీ జడ్ ఆయన గదికి వెళ్లింది. ఆష్లీ వచ్చిన టైమ్‌కి హార్వీ స్నానానికి సిద్ధ్ధమవుతున్నాడు. ఆష్లీ తన గదిలోకి రాగానే, ‘వచ్చి బాడీ మసాజ్ చేయమ’ని అడిగాడు హార్వీ. లేదంటే తాను స్నానం చేస్తూంటే చూస్తూ ఉండమని అన్నాడు. ఆష్లీకి కోపం వచ్చింది. అతణ్ని తప్పించుకొని హోటల్ నుంచి వెళ్లిపోయింది. అదే రోజు ఆ విషయం తన తండ్రికి చెప్పింది. కొద్ది రోజులకు ఫ్రెండ్స్‌కు చెప్పింది. కొన్నాళ్లకు తెలిసినవాళ్లకు చెప్పింది. కానీ 20 ఏళ్ల తర్వాత.. (2017 నవంబర్ 5న) ఆష్లీ ప్రపంచానికి ఈ విషయం చెప్పింది.
ఒక్కసారి బయటకొచ్చి చెప్పిన తర్వాత అదెంత పెద్ద ఉద్యమంగా మారిందో చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా తమపై కూడా ఇలాంటి దాడులు జరిగాయంటూ ఆడవాళ్లంతా గొంతు కలిపారు. మీటూ అన్న ఉద్యమం మొదలైంది. ‘ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చెప్పాలనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ఇది చెప్పక తప్పదు. ఇలాంటివి దాచొద్దు అనిపించింది. ముందుకు రావాలనిపించింది’ అంటోంది ఆష్లీ జడ్, మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ. హాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ దీని గురించి స్పందిస్తున్నారు. మాట్లాడుతున్నారు. మార్పు వస్తూనే ఉంటుంది, రావాలి కూడా. ఆష్లీ జడ్ ఇప్పుడొక మార్పుకు మొదటి అడుగు వేసింది.