ఆటోనగర్ సూర్య రెడీ
‘‘ఈ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడినా యూనిట్ సభ్యులు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌కి ఉన్న గుడ్ విల్ ఈ సినిమాతో రెట్టింపు అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. దేవా కట్టా దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సమర్పణలో అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘మామూలుగా ఏ సినిమాకైనా ఆటంకాలు ఎదురైతే టెక్నీషియన్స్ డిస్ట్రబ్ అవుతారు. కానీ, దేవా కట్టా ఓ నమ్మకంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
వినూత్న కథాంశంతో రొటీన్‌కి భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి మేధస్సు ఉన్న దర్శకుడు. ఈ చిత్రంతో నాగచైతన్య కమర్షియల్ హీరోగా ఇంకా ఎదుగుతాడు’’ అన్నారు. దేవా కట్టా మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రకథ వినగానే థ్రిల్ అవ్వడంతో పాటు, నా మీద నమ్మకంతో వెంకట్‌గారు నిర్మించారు. ఈ 27వ తేదీ మా టీమ్‌కి గ్రేట్ డే. సినిమా విజయంపట్ల మేమంతా ఆశావహ దృక్పథంతో ఉన్నాం. ఈ సినిమా బాగా రావడానికి మేం పడిన శ్రమకు ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.