
'గాడ్‌ఫాదర్'గా బాలయ్య..?
ఏ నటుడి జీవితంలో అయినా వందో సినిమాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ తరం నటుల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగే హీరోలు అసలు కనిపించటం లేదు. అలాంటి అరుదైన మైలురాయికి అతి చేరువలో ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 99వ సినిమా చేస్తున్న బాలయ్య 100వ సినిమా గ్రాండ్‌గా ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు.
బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య చేయబోయే 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న బాలకృష్ణ వందో సినిమాను సక్సెస్ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో మరోసారి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు గాడ్ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.