
అంతలోనే.. అనంతలోకాలకు
హైదరాబాద్ :
ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భరత్కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించిన భరత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యే అరుదైన అవకాశం భరత్కు వచ్చింది.
బిగ్ బాస్ షోకి భరత్ సెలక్ట్ అయినట్టు సమాచారం. తదుపరి బిగబాస్ సిరీస్‌లో నటించే అవకాశం చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొంటే దేశవ్యాప్తంగా మంచి పేరు లభించే అవకాశం ఉండేది. ఈ షోకు సంబంధించి మరో నెలలోనే షూటింగ్కు ప్రణాళికలు కూడా రూపొందించారు. దీనిలో భాగంగా ఫిట్‌నెస్ కోసం భరత్ కసరత్తు కూడా ప్రారంభించినట్టు సమాచారం. అయితే అంతలోనే ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరం.