
ఫ్యాషన్‌ని క్యాష్ చేసుకుంటున్నారు!
హీరోయిన్లు చాలామంది కేవలం నటించడానికే పరిమితం కావడంలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా
హీరోయిన్లు చాలామంది కేవలం నటించడానికే పరిమితం కావడంలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా రకరకాల బిజినెస్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా వీళ్ల ఫోకస్ అంతా ఫ్యాషన్ డిజైనింగ్ మీదే. బాలీవుడ్‌లో ఇప్పుడు చాలామంది... తారలు ఈ ఫ్యాషన్ బిజినెస్ వైపు ఎంతో ప్యాషన్‌గా అడుగులేస్తున్నారు. ఆ తారల గురించి తెలుసుకుందాం...
పిచ్చెక్కిపోవాల్సిందే!
మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ‘నంబర్ వన్’ హీరోయిన్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మాధురి ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఓ పక్క పాత్రలు చేస్తూనే, మరోపక్క ‘మ్యాడ్జ్’ పేరుతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టారు. 30 ఏళ్ల సినిమా కెరీర్‌లో మాధురి ఎన్నో కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ కాస్ట్యూమ్స్‌ని ఎలా డిజైన్ చేశారనే విషయంపై ఆమె దృష్టి పెట్టేవారట. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆమెకు మంచి అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే ఆమె ‘మ్యాడ్జ్’ని ప్రారంభించారు. కాటన్, లిక్రా.. ప్రధానంగా ఈ రెండు రకాల మెటీరియల్స్‌తో దుస్తులు తయారు చేస్తుంటుంది మ్యాడ్జ్. మాధురి తన వ్యక్తిగత అభిరుచిని క్రోడీకరించి, దుస్తులు డిజైన్ చేయిస్తున్నారు. సో.. మ్యాడ్జ్ కలక్షన్స్ ధరిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే అన్నమాట.
బెబో... డిజైన్ అబ్బో!
ట్రెండీగా ఉండటం కరీనా కపూర్‌కి చాలా ఇష్టం. ఆమెను ‘ఫ్యాషన్ ఐకాన్’ అని అంటారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ అవుతుంటారు. అందుకే, ఒక అంతర్జాతీయ బ్రాండ్ కరీనాని తమ కోసం డెనిమ్స్ డిజైన్ చేయమని కోరింది. కరీనా ముద్దు పేరు బెబో. ఆమె డిజైన్ చేసే కలక్షన్‌కి ఆ పేరే పెట్టారు. డెనిమ్ మెటీరియల్‌తో కరీనా డిజైన్ చేయించే ట్రెండీ డ్రెస్సులకు బాగా క్రేజ్ ఉందని సమాచారం. బెబో డిజైన్ అబ్బో అని కూడా చాలామంది అంటున్నారట.
ట్రెండీ ట్రెండీగా...
ఫ్యాషన్‌గా ఉండటం బిపాసా బసుకి చాలా ఇష్టం. తొడుక్కునే బట్టలు, పెట్టుకునే నగలు, వేసుకునే చెప్పులు.. ఇలా అన్నీ చాలా స్టయిల్‌గా ఉండాలనుకుంటారు. విడిగా కూడా చాలామంది అమ్మాయిలు స్టయిల్‌కి బోల్డంత ప్రాధాన్యమిస్తారు కాబట్టి.. వాళ్ల కోసం ‘ట్రంక్ లేబుల్’ పేరుతో బిపాసా బసు ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు... ఇవన్నీ డిజైన్ చేయిస్తున్నారామె. బిపాసానా మజాకానా అన్న చందంగా ఆ డిజైన్స్ అన్నీ ట్రెండీ ట్రెండీగా ఉన్నాయని బాలీవుడ్ టాక్.
లైట్ వెయిట్ శారీస్ సో నైస్
ప్రపంచంలో ఎన్ని రకాల డ్రెస్సులు అయినా రానివ్వండి.. చీరకట్టులో ఉన్న అందం వేరే దేనిలోనూ ఉండదు. అందుకే, శిల్పాశెట్టి మగువల మనసు దోచేలా మంచి చీరలు డిజైన్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఎస్‌ఎస్‌కె’ డిజైనర్స్ ఆరంభించారామె. శిల్పా మంచి మంచి డిజైనర్ శారీస్ కట్టుకుంటుంటారు. ఎస్‌ఎస్‌కెలో అలాంటివే తయారు చేయిస్తున్నారు. షిఫాన్, జార్జెట్ చీరలకు జరీ ఎంబ్రాయిడరీ, క్రిస్టల్ వర్క్‌తో హంగులద్ది డిజైనర్ శారీస్ తయారు చేయిస్తున్నారామె. లైట్ వెయిట్ శారీసే తమ ప్రధాన లక్ష్యమని, భారతీయ వనితలను దృష్టిలో పెట్టుకునే చీరలు డిజైన్ చేయిస్తున్నామని, ఆధునికతకు పెద్ద పీట వేస్తున్నామని శిల్పా అంటున్నారు.
యువతరం ఫ్లాట్ అయ్యేలా...
కుర్ర కథానాయిక సోనమ్ కపూర్ కూడా వ్యాపారం మొదలుపెట్టేశారు. తన చెల్లెలు రియా కపూర్‌తో కలిసి ‘రీసన్’ అనే పేరుతో ఫ్యాషన్ లైన్ ఆరంభించారు. సోనమ్ వేసుకునే దుస్తులను దాదాపు రియానే డిజైన్ చేస్తారు. ఆమెకు డిజైనింగ్ మీద మంచి పట్టు ఉంది. అవి సోనమ్ ధరిస్తుంటారు కాబట్టే, ఆమెకు స్టయిలిష్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. కాలేజీ గాళ్స్‌కి సోనమ్ స్టయిల్ అంటే క్రేజ్. వాళ్లని దృష్టిలో పెట్టుకునే రీసన్‌లో ట్రెండీ డ్రెస్సులు తయారు చేయిస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు యువతరం ఓటు తమ బ్రాండ్‌కే అంటున్నారు.
యంగ్ ఎట్ హార్ట్
ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నది శ్రద్ధాకపూర్ కల. అందుకే ‘ఇమారా’ పేరుతో ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టారు. శ్రద్ధా టార్గెట్ అంతా మోడ్రన్ గాళ్స్ మీదే. పాత కాలం డిజైన్స్‌ని ఆదర్శంగా తీసుకుని క్లాస్ టచ్‌తో దుస్తులు తయారు చేయించడం తన లక్ష్యం అని శ్రద్ధా అంటున్నారు. ముఖ్యంగా ఇంటి గడప దాటి ఇండిపెండెంట్‌గా ఉద్యోగాలు చేసుకునే మహిళలను దృష్టిలో పెట్టుకుని, దుస్తులు తయారు చేయిస్తున్నారామె. వయసులో ఉన్నవాళ్లు మాత్రమే కాదు.. మధ్యవయస్కులూ ‘ఇమారా’ డిజైన్ చేసిన దుస్తులు ధరిస్తే, ‘యంగ్ ఎట్ హార్ట్’లా ఫీలవుతారట.
తెరపై హాట్..తెరవెనుక ట్రెడిషనల్
హాట్ గాళ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మలైకా అరోరా ఖాన్ ఆ ఇమేజ్‌కి భిన్నంగా దుస్తులు డిజైన్ చేయాలనుకున్నారు. ఆమె ఫ్యాషన్ లేబుల్ పేరు ‘ది క్లోజస్ట్ లేబుల్.కామ్’. తెరపై సెక్సీ అవుట్‌ఫిట్స్‌లో కనిపించే మలైకా, తన క్లాతింగ్ లైన్ ఆల్‌మోస్ట్ ట్రెడిషనల్‌గా ఉండేట్లు చూసుకుంటున్నారు. అలాగని, లేటెస్ట్ ట్రెండ్‌ని మాత్రం మిస్ కావడంలేదు.
సరసమైన ధరలతోనే డిజైనర్ కాస్ట్యూమ్స్
అందరికీ అందుబాటులో ఉండే దుస్తులు అందించాలన్నది లారా దత్తా కొన్నేళ్ల కల. ఈ ఏడాది ఆ కలను నెరవేర్చుకున్నారు. పాపకు జన్మనిచ్చాక ఇంటిపట్టున ఉన్న లారా దత్తా ఫ్యాషన్ గురించి కొంచెం స్టడీ చేశారు. ఆ అవగాహతో ఓన్ లేబుల్ మొదలుపెట్టారు. భారతీయ వనితల కోసమే డిజైన్ చేస్తున్నానని, అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ‘చాబ్రా 555’ అనే డిజైనింగ్ లైన్‌తో కలిసి లారా దత్తా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారు.
రే ఆఫ్ హోప్!
జీవితం హాయిగా సాగుతున్నప్పుడు క్యాన్సర్ రూపంలో లిసా రేకి పెద్ద కుదుపే వచ్చింది. కానీ, నమ్మకంతో చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. ‘రే ఆఫ్ హోప్’ పేరుతో ఓ డిజైనర్ లేబుల్‌ని ఆరంభించారు. జీవితం అంటే ఓ నమ్మకమని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునే ఫ్యాషన్ డిజైనింగ్ లేబుల్‌కి ‘రే ఆఫ్ హోప్’తో పేరు పెట్టానని లిసా పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకి మాత్రమే కాదు.. అనారోగ్యంతో బాధపడేవారిలో ఆత్మవిశ్వాసం కల్పించే విధంగా ఉండే చీరలు డిజైన్ చేయించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు లిసా రే.
- డి.జి. భవాని