
సల్మాన్,షారుఖ్ లకు క్లీన్ చిట్
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లకు వివాదాస్పద కేసుకు సంబంధించి క్లీన్ చిట్ లభించింది. టీవీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 9’ షూటింగ్లో భాగంగా ఓ స్టూడియోలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దేవాలయంలో వాళ్లిద్దరూ బూట్లు వేసుకుని నటించిన వ్యవహారంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మత భావాలను దెబ్బతీయడం, కించపరిచే ఉద్దేశం షారుఖ్, సల్మాన్ ఖాన్‌లకు లేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
దీంతో మెజిస్ట్రేట్ వీరిద్దరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు. ప్రోమో షూటింగ్‌లో భాగంగా వీరు బూట్లు వేసుకుని నటించారు. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక మాత్రమేనని, పవిత్ర ప్రదేశం కాదని, ఇందులో సమాజంలోని ఏ వర్గాన్నీ, మతాన్నీ కించపరిచే ఉద్దేశం వీరికి లేదని పోలీసులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)లో పేర్కొన్నారు.