పుట్టినిల్లు.. మెట్టినిల్లు.. | Celebrities Sankranthi Celebrations | Sakshi
Sakshi News home page

పుట్టినిల్లు.. మెట్టినిల్లు..

Published Tue, Jan 15 2019 9:56 AM | Last Updated on Tue, Jan 15 2019 10:05 AM

Celebrities Sankranthi Celebrations - Sakshi

సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతి పండగకు మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా సంబరాల్లో మునిగిపోవాల్సిందే. పతంగుల ఎగరవేత, పిండివంటల రుచులతో ఆనందంగా గడపాల్సిందే. కుటుంబ సభ్యులతో పండగ చేసుకోవాల్సిందే. సంక్రాంతి సంబరాలపై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురిని ‘సాక్షి’ పలకరించగా.. వారు పండగ చేసుకునే విధానాన్ని ఇలా వివరించారు.

వైజాగ్‌లో అనాథల మధ్య..
షూటింగ్‌ నిమిత్తం ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నాను. ఇక్కడ ఉండటం సంక్రాంతి పండగ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నాను. వైజాగ్‌లో ‘ప్రేమ సమాజం’ అనే అనాథాశ్రమం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసిన సందర్భంగా దీనిని సందర్శించారు. అప్పటి నుంచి మన తెలుగు సినీ తారలు చాలా మంది ఇక్కడకు వస్తూ అనాథలతో ఆనందాలను పంచుకునేవారు. ఇప్పుడు నేను కూడా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉన్న 70 మంది అనాథ పిల్లలు, మరో 150 మంది వృద్ధుల మధ్య భోగీ జరుపుకొన్నాను. ఈ సంక్రాంతి నాకు ఎన్నో ఆనందాలను ఇచ్చింది. 
– అలీ, హాస్యనటుడు

కావలిలో కార్యకర్తలతో..  
ప్రతి సంక్రాంతికి నేను ఊరిలోనే ఉంటాను. ఈసారి కూడా కావలిలో ఉన్నాను. పార్టీ కార్యకర్తలతో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. చల్లని చలిలో భోగి మంటలు కాచుకుంటూ ఆనందాలను పంచుకున్నాం. సంప్రదాయంగా వస్తున్న కోడిపందేలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ.. నేను అయ్యప్ప మాలలో ఉండటం వల్ల ఈసారి అవి ఆడలేకపోతున్నాను. కోడిపందేలు మినహాయించి సంక్రాంతి సంబురాలన్నీ అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నాం.  
– పృథ్వీ, సినీనటుడు

ఫ్రెండ్స్‌తో కలిసి పతంగులు ఎగరవేస్తూ..  
మాది కృష్ణా జిల్లాలోని పామర్రు. ఈసారి సంక్రాంతికి అందరం ఇక్కడే ఉన్నాం. పల్లెటూరి సంక్రాంతి వాతావరణాన్ని చాలా మిస్‌ అవుతున్నాను. అదే సమయంలో స్నేహితులతో కలిసి అమీర్‌పేటలో పెద్ద బిల్డింగ్‌పై పతంగులు ఎగరవేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నా. నా చిన్నప్పటి ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చి నాతో పాటు పతంగులు ఎగరేస్తారు. ఈసారి పండగను పతంగులతో సరిపెట్టుకుంటున్నాం.
 – శ్రీరామ్‌ ఆదిత్య, డైరెక్టర్‌

పుట్టినిల్లు.. మెట్టినిల్లు..
అమ్మ, అత్త, మామల మధ్య ఈ సంక్రాంతిని జరుపుకొంటున్నాను. భర్త, పిల్లలతో కలిసి బిల్డింగ్‌పై పతంగులు ఎగరవేస్తున్నాను. రెండు రోజులు అత్తగారి ఇంట్లో సంక్రాంతి జరుపుకొన్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, బంధువులు కూడా రావడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనందాన్నిస్తోంది. మంగళవారం అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి నోములు తీసుకుంటాం. ఈ సంక్రాంతికి ఇదే స్పెషల్‌.
– అనసూయ, నటి

చెన్నైలో సంక్రాంతి సందడి
ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి సమయంలో చెన్నై వెళ్తా. అక్కడ బాగా చేస్తారు. మట్టి కుండల్లో పొంగల్‌ వండుతుండగా పాలు పొంగే సమయంలో అమ్మాయిలు అందరం ‘పొంగలో.. పొంగలో’ అంటూ డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తాం. ఇంటికి వచ్చిన బంధువులకు మేం చేసిన స్వీట్స్‌ రూచి చూపించడం, చెరకు గడలతో నోటిని తీపి చేసుకోవడం వంటివి చేస్తూ సంక్రాంతి పండగను ఆస్వాదిస్తాం.
– సమీర భరద్వాజ్, సింగర్‌


కుటుంబ సభ్యులతో..  

ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో మూడు పండగలు. సంక్రాంతి, భోగీతో పాటు అమ్మ, నాన్నల పుట్టినరోజు కూడా. సో.. భోగి రోజు అమ్మ పుట్టినరోజు, సంక్రాంతి రోజు నాన్న పుట్టినరోజును సంతోషంగా కుటుంబం అంతా జరుపుకొంటాం. సాయంత్రం సమయంలో బిల్డింగ్‌ టెర్రస్‌పైకి వెళ్లి పతంగులను చూస్తుంటాం. బంధువులు తెచ్చిన స్వీట్స్‌ మేం తీసుకుని, మా స్వీట్స్‌ బంధువులకు ఇస్తుంటాం.  
– రమ్య బెహరా, సింగర్‌

స్నేహితుల మధ్య..  
సంక్రాంతి పండగ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఏడాది గ్రామానికి వెళ్తుంటా. కానీ.. ఈసారి వెళ్లలేకపోయా. పల్లెల్లోని వాతావరణాన్ని ఇక్కడ సెట్‌ చేస్తున్నా. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెడిషనల్‌ దుస్తుల్లో ప్రత్యేక పూజలు చేసి, కొద్దిసేపు కైట్స్‌ ఎగరవేస్తా. సాయంత్రానికి బంధువులను ఇంటికి పిలిచి వారితో సంక్రాంతి సంబురాలను జరుపుకొంటాను.
– ప్రిన్స్, సినీ హీరో

నానమ్మతో కలిసి..  
ప్రతి సంక్రాంతికి వైజాగ్‌ వెళ్తుంటా. కానీ.. ఈసారి నా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతున్న కారణంగా ఇక్కడే ఉండిపోయాను. నాకు తోడుగా నానమ్మ ఇక్కడకు వచ్చింది. ఆమెతో కలిసి సంక్రాంతి పండగ చేసుకుంటున్నాను. మంగళవారం నానమ్మతో కలిసి కైట్స్‌ ఎగరవేస్తా. చిన్ననాటి ఫ్రెండ్స్, బంధువులందర్నీ ఇంటికి పిలిచి పండగను జరుపుకొంటాను.
– సందీప్‌ కిషన్, సినీ హీరో

సంక్రాంతి పండగ ఎంతో ఇష్టం..
బంజారాహిల్స్‌: సంక్రాంతి పండగ రోజున వీధుల్లో రంగవల్లులను దాటుకుంటూ హరిదాసులు వచ్చే దృశ్యాలంటే నాకెంతో ఇష్టం.  గతంలో ప్రతి సంక్రాంతి పండగకు విశాఖపట్నం వెళ్లడం బాగా  ఇష్టంగా ఉండేది.  ఐతే ఇప్పుడు మా కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటుండటంతో పండగలకు వెళ్లడం లేదు. పండగ రోజున గారెలు తినడమంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు పతంగులు ఎగరేసేవాణ్ని. సంక్రాంతి, దీపావళి అంటే మహా ఇష్టం. 
– కౌషల్, బిగ్‌బాస్‌– 2 విజేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement