టైటిల్ : చెలియా
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : కార్తీ, అదితి రావ్ హైదరీ, రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
నిర్మాత, దర్శకత్వం : మణిరత్నం
చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చెలియా. మణి మార్క్ విజువల్స్ తో టేకింగ్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెలియా మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? మణిరత్నం ఫాం కంటిన్యూ చేశాడా..? మాస్ హీరోగా ఇమేజ్ ఉన్న కార్తీ మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..?
కథ :
చెలియా కథ 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో జరుగుతుంది. ఓ యుద్ధవిమాన ప్రమాదంలో గాయపడిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వరుణ్ అలియాస్ వీసీ(కార్తీ) పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుతాడు. రావల్పిండిలోని జైల్లో వరుణ్ ను చిత్రహింసలకు గురిచేస్తారు. అలా చీకటి గదిలో బందిగా ఉండగా వరుణ్ కి గతం గుర్తుకు వస్తుంది. వరుణ్, శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఫైటర్ పైలెట్. తన సుపీరియర్ ఆఫీసర్ కూతురు గిరిజ( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో ఉంటాడు. ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన వరుణ్ కు యాక్సిడెంట్ అవుతుంది. మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లేంత సమయం లేకపోవటంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డ్యూటి డాక్టర్ లేకపోవటంతో అప్పుడే డ్యూటిలో చేరిన లీలా అబ్రహం(అదితి రావ్ హైదరీ) వరుణ్ ని ట్రీట్ చేస్తుంది. తొలి చూపులోనే లీలాతో ప్రేమలో పడిన వరుణ్, గిరిజ వాళ్ల పేరెంట్స్ కు నో చెప్పేస్తాడు.
హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి లీలా వెంట పడటం స్టార్ట్ చేస్తాడు. లీలా అన్న వరుణ్ బ్యాచ్ మెట్ కావటంతో వరుణ్ గురించి ముందే తెలుసుకున్న లీలా వరుణ్ కి దగ్గరవుతుంది. అయితే తన మాటే గెలవాలన్న నెగ్గలన్నట్టుగా ఉండే వరుణ్, తన ఇండివిడ్యూవాలిటీ తనకు ఉండాలనుకునే లీలాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల మధ్యే లీలా గర్భవతి అని తెలుస్తుంది. వరుణ్ పెళ్ళికి నో చెప్పటంతో లీలా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వటంతో లీలాను వెయిట్ చేయమని చెప్పి వరుణ్ వెళ్లిపోతాడు. అలా వెళ్లిన వరుణ్ ఫైటర్ ప్లేన్ ప్రమాదం కారణంగా కూలిపోతుంది. వరుణ్ పాక్ ఆర్మీకి బంధీ అవుతాడు. పాక్ జైల్ ఉన్న వరుణ్ ఎలా బయటపడ్డాడు.? తిరిగి లీలాను కలుసుకున్నాడా..? లీలా వరుణ్ ను ఎలా రిసీవ్ చేసుకుంది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కార్తీ తొలిసారిగా మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తో పూర్తి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలో కనిపించాడు. మణి, కార్తీ మీద పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు. ఆర్మీ ఆఫీసర్ లో ఉండే ఆవేశం, అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి కోసం పడే తపన ఇలా రెండు భావాలను గొప్పగా పలికించాడు. హీరోయిన్ గా నటించిన అదితి రావ్ హైదరీ తన అందంతోనే సగం మార్కులు కొట్టేసింది. నటిగానూ కార్తీకి గట్టిపోటినిచ్చింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్ తమ పరిది మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణులు :
ప్రతీ ఫ్రేమ్ లోనూ ఇది మణిరత్నం సినిమా అని తెలిసేలా తెరకెక్కించే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, చెలియాతోనే అదే చేశారు. గ్రాండ్ విజువల్స్, మనసు తాకే ఎమోషన్స్, క్యూట్ రొమాన్స్, దేశభక్తి ఇలా మణి మార్క్ సినిమా అంతా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్తీని ఫైటర్ పైలట్ గా చూపించిన మణిరత్నం దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ భారత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈజీగా తప్పించుకొని తిరిగి భారత వచ్చేయటం అంత నమ్మశక్యంగా అనిపించదు. అదే సమయంలో మణి మార్క్ స్లో నారేషన్ కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే ఎస్ రవివర్మన్ సినిమాటోగ్రఫి అన్ని మరిచిపోయేలా చేస్తుంది. కాశ్మీర్ అందాలను తెర మీద అద్భుతంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజ్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. మణి టేకింగ్ కు రెహమాన్ సంగీతం తోడై మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కార్తీ నటన
అదితిరావ్ హైదరీ అందం
సినిమాటోగ్రఫి
లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
రొటీన్ స్క్రీన్ ప్లే
చెలియా.. మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికోసం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
'చెలియా' మూవీ రివ్యూ
Published Fri, Apr 7 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement
Advertisement