దర్శకుడు కే బాలచందర్ (పాత చిత్రం)
సాక్షి, చెన్నై : లెజెండరీ దర్శకుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.. కే బాలచందర్ ఆస్తుల వేలం వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిదేం జరగబోదని నిర్మాణ సంస్థ.. ఆస్తులను వేలం వేసి తీరతామని యూకో బ్యాంక్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం మొదలైంది.
ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో రజనీ కాంత్, కమల్ హాసన్‌లు గురువు కోసం ఏదైనా చేస్తారేమోనని అంతా ఎదురు చూశారు. వారు స్పందించకపోయినప్పటికీ ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలచందర్ ఆస్తుల వేలం ఉండబోదని తెలిపింది. ‘వ్యాపారంలో భాగంగానే బాలచందర్.. ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోవటంతో రుణంపై వడ్డీ పేరుకుపోయింది. 1.36 కోట్లకు వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు రుణం తిరిగి చెల్లించాం. మిగతా రుణాన్ని సింగిల్ సెటిల్‌మెంట్‌లో చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు’ అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు.
అయితే బ్యాంక్ మాత్రం ఈ ప్రకటనపై సానుకూలంగా స్పందించలేదు. బాలచందర్ ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని, ఇది కోర్టు పరిధిలో వ్యవహారం కాబట్టి ఇంతకు మించి స్పందించలేమని బ్యాంకు అధికారులు చెప్పటంతో గందరగోళం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment