
అజయ్ స్వామినాథన్ మిస్సింగ్
నేడు సినిమా యువతరం చేతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తమ యుక్తిని జోడించి లబ్ధిపొందడంతో కృతకృత్యులవుతున్నారు. అదే సమయంలో కొంచెం వివాదాస్పద అంశాలకు తావిచ్చేలా కార్యక్రమాలు చేపడుతూ తద్వారా ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన తాజా చిత్రం నయనతారది కావడం విశేషం. ఈ సంచలన తార నటిస్తున్న తాజా చిత్రం అనామిక. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన కహానీకి ఇది రీమేక్. ఇందులో నయనతార మిస్ అయిన ప్రియుడి కోసం గాలించే ప్రియురాలి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రచార పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పెన్సిల్ స్కెచ్ ఫొటోతో కూడిన ఈ పోస్టర్‌పై అజయ్‌స్వామినాథన్ అనే వ్యక్తి కనిపించడం లేదు. ఆయన వయసు, ఎత్తు ఇక్కడ పేర్కొన్నాం.
అజయ్ స్వామినాథన్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే అనామిక స్వామినాథన్ (www.Facebook.com/viacom18 tami)కు సమాచారం అందించండి అని ఉంది. ఈ పోస్టర్లు అనామిక చిత్ర ప్రచారం కోసం ముద్రించినవి. ఈ కొత్త రకం ప్రచారం చూపరుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోందని చిత్ర వర్గం పేర్కొంటోంది. ఇది చాలా చీఫ్ ప్రచారమంటూ హిందూమక్కల్ కట్చి దుయ్యపడుతోంది. ఈ తరహా ప్రచారం హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను, మనో భావాలను కించపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆ పార్టీ జోనల్ అధ్యక్షుడు ముత్తురమేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి చీఫ్ ప్రచారంతో మనుషుల మనోభావాలతో ఆడుకోవడం తగదన్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లను అంటించడానికి తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ ఎవరినీ నొప్పించాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. చిత్ర ప్రసారం కోసమే ఈ తరహా పోస్టర్లను రూపొందించినట్లు వివరించారు. ఇది వినూత్న ప్రచారంలో భాగమేనని పోస్టర్లపై కూడా చిత్ర నిర్మాతను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించగలరని స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.