
పెరంబూరు: తలైవా రజనీకాంత్‌కు ఐకాన్ అవార్డుపై పలువురు విమర్శల దాడి చేస్తున్నారు. సినీకళామతల్లికి అందించిన విశేష సేవలకు గానూ కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకూ గోవాలో జరిగే అంతర్జాతీయ చిత్రోత్సవాల వేదికపై రజనీకాంత్‌కు ప్రదానం చేయనున్నారు. కాగా రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడంపై కోలీవుడ్‌లో అభినందనలు, విమర్శలు ఎదురవుతున్నాయి. రజనీకాంత్‌కు సహ నటుడు, సన్నిహితుడు అయిన కమలహాసన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ 2 చిత్రంలో భాగంగా భోపాల్‌లో ఉన్న కమలహాసన్ ఆదివారం రజనీకాంత్‌కు ఫోన్ చేసి అభినందించారు. అదే విధంగా పలువురు సినీ, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపా రు. అయితే ఆయనకు ఈ అవార్డును ప్రకటించడాన్ని నామ్ తమిళర్ పార్టీ అధినాయకుడు సీమాన్ లాంటి కొందరు వ్యతిరేకిస్తున్నారు.
మిత్రుడు కావడం వల్లే..
ఒక కేసు వ్యవహారంలో సోమవారం తిరుచ్చికి వచ్చిన నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్‌ను రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రకటించడం గురించి స్పందించాల్సిందిగా మీడియా అడగ్గా ఆయన రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడాన్ని స్వాతిస్తున్నానన్నారు. అయితే ఆయన కంటే సాధించిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. నటుడు కమలహాసన్ గత 60 ఏళ్లుగా సినిమా రంగంలో సాధిస్తూనే ఉన్నారని, అదే విధంగా దర్శకుడు భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా వంటి వారు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. అయితే నటుడు రజనీకాంత్ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి మిత్రుడు కావడం వల్లే ఈ అవార్డును అందిస్తున్నారని విమర్శించారు.
కమల్‌కు ఎందుకు ఇవ్వలేదు..
ప్రముఖ రచయిత పట్టుకోట్టై ప్రభాకర్ రజనీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెడ్ జూబ్లీ అవార్డును ప్రకటించడంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అంతరుద్దేశం ఏదో ఉందని విమర్శించారు. ఈ అవార్డును కమలహాసన్‌కు ప్రకటించకపోవడం గురించి తన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఆయనపై ధ్వజమెత్తారు. తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో తను పోస్ట్ డిలీట్ చేసిన ఆయన మరో ట్వీట్ చేశారు. తాను రజనీకాంత్‌కు వ్యతిరేకినో, కమలహాసన్‌కు మద్దతుదారుడినో కాదన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, తమిళ సినిమా గుర్తింపుగా చెప్పబడే అవార్డు గురించే తన అభిప్రాయాన్ని వెల్లడించానన్నారు. వసూళ్లు మాత్రమే ఈ అవార్డుకు ప్రాతిప్రదిక కాదని, తమిళసినిమాకు ప్రపంచ స్థాయిలో మార్కెట్‌ను తీసుకురావడం వెనుక నటులు మాత్రమే కారణం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రజనీకాంత్ మాట్లాడటం, బీజేపీ ఆయనకు తమిళనాడులో తమ పార్టీ పగ్గాలను అందించాలని భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును రజనీకాంత్‌కు ప్రకటించారంటూ వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తన సినిమాలతో పరిచయం చేస్తూ, సినిమా అభివృద్ధికి ఎల్లప్పుడూ కమలహాసన్ కృషి చేస్తారని, ఈ విషయం అందరికీ తెలుసునని అన్నారు. తన దృష్టిలో రజనీకాంత్ కంటే కమలహాసనే తమిళ సినిమాకు ప్రత్యేకమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment