నాన్నే స్ఫూర్తి ప్రదాత
నాన్నే స్ఫూర్తి ప్రదాత
Published Wed, Mar 19 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
నాకు నాన్న సహకారం సదా ఉంటుంది. నాకు గొప్ప స్ఫూర్తి ప్రదాత కూడా ఆయనే. నేను నాన్నతో కలిసి నటించకపోయినా సంగీతపరంగా ఆయనతో అనుభూతిని ఎప్పుడూ పంచుకుంటాను. చక్కని ఆత్మీయతానుబంధాన్ని తెలిపే ఈ వ్యాఖ్యలు చేసింది కమల్ హాసన్ ప్రథమ పుత్రిక, ప్రముఖ కథానాయకి నటి శ్రుతి హాసన్. ఎలాంటి సందర్భంలో ఈమె ఈ వ్యాఖ్యలు చేశారంటే, శ్రుతి హాసన్ ముందు సంగీత కళాకారిణి. ఆ తరువాతే నటీమణి అన్న విషయం తెలిసిందే. ఈమెలో మంచి సంగీత దర్శకులు, గాయని ఉన్నారు. తొలుత పలు సంగీత ఆల్బమ్స్ రూపొందించారు.
ఆ తరువాత తన తండ్రి నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అసలు విషయం ఏమిటంటే శ్రుతి హాసన్ అస్సామి సంగీత కళాకారుడు జాయ్ బరువాతో కలిసి ప్రతిబి గురే అనే పాటను 2012లో రూపొందించారు. దీనికి తమిళ సాహిత్యాన్ని కమల్ హాసన్ రాయడం విశేషం. ఈ సాంగ్‌తో కూడిన వీడియో ఆల్బమ్ ఇటీవలే తయారయ్యింది. వైవిద్యభరితమయిన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్ సంగీత ప్రియుల నుంచి చాలా మంచి ఆదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. శృతి హాసన్ మాట్లాడుతూ విభిన్న సంగీత కళాకారులతో కలిసి పని చేయడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు.
అది స్వతంత్ర సంగీత కళాకారులయినా, సిని సంగీత కళాకారులయినా కావచ్చన్నారు. భిన్న సంస్కృతుల మన దేశాన్ని కొత్తగా చూపాలన్న ఆలోచనే ఈ ఆల్బమ్ రూపకల్పనకు కారణం అని పేర్కొన్నారు. ఇందులో సంగీతం, సాహిత్యం చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయన్నారు. దీనికి తన తండ్రి కమల్ హాసన్ తమిళ సాహిత్యాన్ని అందించారని తెలిపారు. తెర్కే ఒరు దురువం అనే పల్లవితో సాగే ఈ పాటను తన తండ్రి సాహిత్యం మరింత వన్నె తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పాటను పూర్తిగా విన్న తర్వాత కమల్ స్పందనేమిటన్న ప్రశ్నకు కాన్సెప్ట్ బాగుంది పాట జాయ్‌ఫుల్‌గా ఉందని ప్రశంసించారని తెలిపారు. నాన్నతో కలిసి నటించకపోయినా సంగీత పరంగా నాన్న తనకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు. సంగీత సాహిత్యంలో ఆయన సహకారం తనకెప్పుడూ ఉం టుందని శ్రుతి అంటున్నారు.
Advertisement
Advertisement