'తమాషా' కోసం... మాజీ ప్రియుడి కోసం
ముంబై: బాలీవుడ్ భామ, సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ ముంబై లోని సిద్ధి వినాయకగుడిని దర్శించింది. తల్లి ఉజాలాతో కలిసి వచ్చిన ఈ భామ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రణబీర్ కోసం కూడా ప్రార్థించానన్న పొడుగు కాళ్ల సుందరి మాటలు, పూజలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో రణబీర్ తో దీపిక ప్రేమాయణం సాగించినట్టు పుకార్లు షికార్లు చేశాయి.
అయితే తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ గుడికి రావడం తనకు ఆనవాయితీ అని దీపికా చెబుతోంది. అందులో భాగంగానే ఈ రోజు (శుక్రవారం) విడుదలైన తమాషా సినిమా విజయం సాధించాలని గణనాధుణ్ని దర్శించుకున్నానంది. అంతేగాక మరో ఆసక్తికర విషయాన్ని కూడా మీడియాకు వివరించింది. మీ ఫ్రెండ్ రణబీర్ కోసం కూడా ప్రార్థించారా అని మీడియా ప్రతినిధులు అడిగినపుడు... 'అవును... రణబీర్ చాలా టాలెంటెడ్ యాక్టర్... జీవితంలో గెలుపు ఓటములు ఎవరికైనా రావడం సహజం.. అలాగే రణబీర్ కు కూడా.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. మూవీ చూశాను.. అతని నటన అద్భుతంగా ఉంది' అని కితాబిచ్చింది. దీంతో తన మాజీ ప్రియుడి కోసం పూజలు చే సిందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

కాగా రణబీర్ కపూర్ తో మూడవసారి జతకట్టింది ఈ తమాషా సినిమాలో. లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్, దీపికా పదుకోన్ జంటగా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ 'తమాషా' అనే సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. యే జవానీ హై దీవానీ సినిమాలాగానే తమాషా మూవీ కూడా బంపర్ హిట్ కావాలని కోరుకుంటోందీ ఈ జంట. బాలీవుడ్ తెర మీద బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ మరోసారి జతకట్టడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ ఈ మాజీ లవర్స్ కలవబోతున్నారంటూ బాలీవుడ్ గుసగుసలాడింది. ఈ నేపథ్యంలో తాజాగా దీపిక వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. అటు ఈ మూవీలో ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
