
సాక్షి, న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కపిల్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోమీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు తనతో కొంత కాలం గడపాలనుందని దీపిక అనుకుంటున్నారు. కపిల్ భార్యగా ఆమె వ్యవహార తీరును దగ్గర నుంచి పరిశీలించేందుకు తనను త్వరలోనే కలుస్తానని దీపిన తెలిపారు. ఇదివరకే ఓ సారి రోమీతో కలిసిన దీపిక తనతో పలు విషాయాలను కూడా పంచుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్‌వీర్ ఇదివరకే కపిల్‌ను కలిసిన విషయం తెలిసిందే. పదిరోజులు కపిల్‌తో గడిపిన సింగ్.. 1983లో జరిగిన ఘటనల గురించి దగ్గరుండి తెలుసుకున్నారు.
కాగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పెళ్లయ్యాక ‘దీప్‌వీర్’ జంట రీల్ లైఫ్ భార్యాభర్తలుగా నటించే తొలి చిత్రం ఇదే. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కపిల్ భార్య రోమి స్టేడియంలోనే ఉన్నారు. అయితే వరల్డ్ కప్ వెస్టిండీస్ సొంతం అవుతుందేమోనన్న అనుమానంతో రోమీ బాధతో స్టేడియం నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత ప్రపంచకప్ టీమిండియా సొంతం అవబోతోందని తెలిసి వెంటనే మళ్లీ స్టేడియం వద్దకు వచ్చారట. తన భర్త సారథ్యంలో టీమిండియా కప్ గెలిచిన సందర్భంగా ఆమె సంతోషంతో కన్నీరుపెట్టుకున్నారట. ఇలాంటి భావోద్వేగాలను, హావభావాలను దీపిక బాగా పండించగలరని భావించిన చిత్రబృందం రోమీ పాత్రకు ఆమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment