
నయనతార
స్మాల్ బ్రేక్ తీసుకున్నారు నయనతార. అదేంటీ తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో ‘సైరా’లో నటిస్తున్నారు కదా.. చిన్న బ్రేక్ ఎప్పుడు తీసుకున్నారు అనుకుంటున్నారా? బ్రేక్ తీసుకున్నది మలయాళంలో. నిజానికి నయనతార మాతృభాష మలయాళం. అయినా మలయాళంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకూ నయనతార తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 70 సినిమాలు చేస్తే వాటిలో మలయాళ సినిమాలు ఓ పది ఉంటాయంతే.
తెలుగు, తమిళంలో మంచి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి మలయాళ సినిమాలపరంగా సంఖ్య తక్కువగా ఉంది. 2016లో మాలీవుడ్‌లో ‘పుదియ నిమయమ్’ చేశాక ఇప్పుడు మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారీ బ్యూటీ. నివిన్ పౌలీ హీరోగా నటించనున్న ఈ చిత్రం ద్వారా ధ్యాన్ శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం కానున్నారు. త్వరలో సినిమా ఆరంభం కానుంది. ఇది లవ్, యాక్షన్, డ్రామా మూవీ. రెండేళ్ల తర్వాత నయనతార మాతృభాషలో నటించడం అక్కడి ఆమె అభిమానులకు హ్యాపీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.