
నాకు టీనేజ్ కొడుకా?
నాకు టీనేజ్ కొడుకున్నాడా? అంటూ నటుడు సిద్ధార్థ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్స్ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఈయనపై ఆది నుంచి వదంతులు షికార్లు చేస్తున్నారుు. అంతేకాదు వివాదస్పద వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ మధ్య నటి సోహా అలీఖాన్, శృతిహాసన్‌తో ప్రేమాయణం అంటూ ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం చెన్నై చిన్నది సమంతతో చెట్టాపట్టాలంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాదు ఇంకాస్త ముందుకెళ్లి సమంత ఇటీవల సిద్ధార్థ్ గూటికి చేరారని ఇద్దరు సహజీవనం చేస్తున్నారని వదంతులు ప్రచారం అవుతున్నాయి. తాజాగా నటుడు సిద్ధార్థ్‌కు టీనేజ్ కొడుకున్నాడనే వార్త ప్రచారం అయ్యింది.
దీంతో సిద్ధార్థ్ తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి అసత్య ప్రచారంతో తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించకండంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తన గురించి, తన కుటుంబం గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధార ప్రచారం తననెంతగానో ఆవేదనకు గురి చేస్తుందన్నారు. తనకంటూ ఒక గౌరవం ఉందని తననింకా చిన్న వాడిగా భావించరాదని అన్నారు. సమీపకాలంలో తన గురించి ప్రచారం అయిన వదంతి తీవ్ర మనస్థాపానికి గురి చేసిందన్నారు. తనకిప్పుడు 35 ఏళ్ల వయసని ముందుకంటే ఇప్పుడు నటుడిగా తీవ్రంగా శ్రమిస్తున్నానని తెలిపారు. జీవితంలో తాను సెటిల్ అయినప్పుడు ఆ విషయం గురించి అందరికీ తెలుపుతానని అప్పటి వరకు దయ చేసి ఇలాంటి వదంతులు ప్రచారం చేయకండి అంటూ సిద్ధార్థ్ విన్నవించుకుంటున్నారు.