నేనే షారూక్ ఫ్యాన్‌ని! : షారూక్ ఖాన్
షారూక్‌ఖాన్ బంగ్లా ‘మన్నత్’లో షారూక్‌ఖాన్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. బయట ఏడెనిమిదొందల మంది ఫ్యాన్స్.... పోలీసులు... ట్రాఫిక్... అంతా గోలగోలగా ఉంది. ఒక్క క్షణం పాటైనా షారూక్‌ని చూడాలనే అందరికీ ఆత్రుత. వాళ్లలో ఒకడు అందరి కంటే ఎక్కువగా హైరానా పడుతున్నాడు. మన్నత్‌లోకి దూసుకెళ్లైనా షారూక్‌ని చూడాలని పోలీసులతో గొడవ పడుతున్నాడు. అయితే అతడు కూడా అచ్చు షారూక్ ఖాన్‌లానే ఉన్నాడు.... ఇది ‘ఫ్యాన్’ సినిమా కోసం ఇటీవల తీసిన సన్నివేశం.
అయితే ఇందుకు వాడింది షారూక్‌ఖాన్ అసలు బంగ్లాను కాదు. సెక్యురిటీ సమస్యలు తలెత్తుతాయని యథాతధంగా అలాంటి బంగ్లానే ఫిల్మ్ సిటీ స్టూడియోలో సెట్ వేసి తీశారు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలో ‘జబ్ తక్ హై జాన్’ హిట్ తర్వాత షారూక్‌తో రాబోతున్న సినిమా ఇది. ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘దమ్ లగాకె హైసా’ వంటి పెద్ద హిట్స్‌ను తీసిన మనీష్ శర్మ దీనికి దర్శకుడు. స్థానికతనీ, హాస్యాన్ని కలిపి తీయడంలో పేరుగడించిన మనీష్ ఇప్పుడు షారూక్‌తో కూడా ఆ వరుసలోనే వినోదాన్ని పంచనున్నాడు. అయితే ఈ సినిమాలో పాటలు ఉండవనేది అభిమానులను కలవరపెడుతున్న వార్త. ఈ కథాగమనానికి పాటలు నప్పవనీ అందుకే సినిమాలో వాటిని పెట్టడం లేదనీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది కూడా. అదే నిజమైతే పాటలు లేని షారూక్ తొలి సినిమా ఇదే అవుతుంది.
బహుశా ఆ వెలితిని అతడు వేస్తున్న రెండు పాత్రలూ దూరం చేస్తాయనే భరోసా నిర్మాత, దర్శకులకు ఉండవచ్చు.
డ్యూయల్ రోల్ సినిమాలు షారూక్‌కు కొత్త కాదు. గతంలో ‘బాజిగర్’, ‘కరణ్ అర్జున్’, ‘బాద్‌షా’, ‘డూప్లికేట్’, ‘ఓం శాంతి ఓం’, ‘డాన్’... వంటి హిట్స్‌ను డ్యూయల్ రోల్స్‌తోనే ఇచ్చాడు. ఇప్పుడు కూడా స్టార్‌గా, ఫ్యాన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కథలో అసలు సూపర్‌స్టార్‌ని, ఫ్యాన్‌ని... అతడు ఇతడనుకుని పొరపాటు పడి కథలో చాలా గందరగోళమూ హాస్యమూ ఉద్విగ్నత చోటు చేసుకుంటుందని భోగట్టా. షారూక్ కూడా ఆ పాత్రలను తేలిగ్గా తీసుకోకుండా గ్రెగ్ కానమ్ వంటి హాలీవుడ్ మేకప్‌మేన్ సహాయాన్ని తీసుకుని ఆహార్యంలో జాగ్రత్త పడుతున్నాడు.
ఈ సినిమా కోసం ఇలియానా, వాణి కపూర్‌లను హీరోయిన్లుగా అనుకున్నారు.
చివరకు ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్‌గా నాటి బాలీవుడ్ హీరో సచిన్ కుమార్తె శ్రీయా పిల్‌గౌంకర్ ఎంపికయ్యారు. షారూక్ గత సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆశించినంత జనాదరణ పొందలేదు. ‘ఇంత చెత్త సినిమాను నేను చూడలేదు’ అని సాక్షాత్తు జయబాధురి నేరుగా తిట్టేంత చెడ్డ పేరును సంపాదించుకుంది. ఆ సినిమా ప్రభావం వల్ల కూడా కావచ్చు ఈ సినిమా కోసం షారూక్ ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్న షారూక్, సల్మాన్ ఖాన్‌ల మధ్య పాత స్నేహం మళ్లీ చిగురిస్తున్న దరిమిలా ఇతని ఫ్యాన్స్ అతనికీ అతని ఫ్యాన్స్ ఇతనికీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ మేరకు రేపు రంజాన్ పండగ నాడు విడుదల కాబోతున్న సల్మాన్ సినిమా ‘బజ్‌రంగి భాయ్‌జాన్’కు ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ కృతజ్ఞతతో షారూక్ ఫ్యాన్స్‌తో పాటు సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఒక కన్నేస్తే ‘ఫ్యాన్’ కలెక్షన్లు ఆకాశంలో గిర్రున తిరుగుతూనే ఉంటాయి.