సెలబ్రిటీల... షార్ట్ కట్ | Film stars Short Film fever | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల... షార్ట్ కట్

Published Tue, Aug 25 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

సెలబ్రిటీల... షార్ట్ కట్

సెలబ్రిటీల... షార్ట్ కట్

సమాజంలోని రుగ్మతలపై... ఇదివరకూ తమ సినిమాల్లో సందేశాలు ఇచ్చేవారు సినీతారలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. షార్ట్‌ఫిల్మ్ ఫీవర్ సెలబ్రిటీలను పట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై... స్పందించడానికి షార్ట్‌ఫిల్మ్ ఆయుధంగా మారింది. అది ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలకు ప్రతిఘటన కావచ్చు! మూర్ఖపు భావజాలంపై పోరు కావచ్చు! ఎయిడ్స్ లాంటి రోగాలపై అవగాహన కల్పించడం కావచ్చు!! ఇలా ప్రతి దానికీ ఒకటే - ‘షార్ట్ ’కట్..! అల్లు అర్జున్ ఏడాది క్రితమే ఇలాంటి ప్రయత్నం చేస్తే తాజాగా గాయని స్మిత, రానున్న రోజుల్లో తాప్సీ - అందరూ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్ రూట్‌లోనే!  
 
అబ్బాయిలూ... ఏడవండి బాబూ!

‘మగపిల్లలు ఏడవకూడదురా’ అంటూ చిన్నప్పుడే వాళ్ల ఏడుపుకి అడ్డుపుల్ల వేసేస్తాం. వాడి మనసులో కూడా ‘నేను మగాణ్ణి నాకేంటి’ అనే భావం బలంగా నాటుకుపోతుంది. పెద్దవాడవుతాడు. ఏడవడు. వాడు ఏడ్వకపోతే పోయాడు.. అమ్మాయిలను ఏడిపించడం మొదలుపెడతాడు. ‘‘ఏడుపంటే ఏమిటో తెలియని అబ్బాయికి... అమ్మాయి ఏడుపు తాలూకు విలువ ఏం తెలుస్తుంది?.. అందుకే అబ్బాయిలనూ ఏడ్వనిద్దాం...’’ అంటున్నారు నటి మాధురీ దీక్షిత్. వినీత్ మ్యాథ్యూ దర్శకత్వం లోని ‘స్టార్ట్ విత్ ది బాయ్స్’ లఘు చిత్రం ఇది.
 
అర్ధరాత్రి... ఒంటరి అమ్మాయి!
అర్ధరాత్రి... ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది ఆ అమ్మాయి. ఇంతలో కారు ముందుకెళ్లనని మొరాయించింది. ఈలోపు అటువైపుగా కారులో వెళుతున్న కొంతమంది యువకులు ఆ అమ్మాయిని చూశారు. అబ్బాయి లకు ఏవేవో ఊహలు. కారు ఎంతకీ బాగవ్వకపోవడంతో వాళ్ల కారులో డ్రాప్ చేయమంటుంది. ఏదేదో చేయొచ్చని మళ్లీ అబ్బాయిలు ఊహల్లో విహరిస్తారు. ఈలోపు ఇల్లు రానే వస్తుంది. అమ్మాయి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకెళ్లి పోతుంది. ‘గోయింగ్ హోమ్’ కథ ఇది.
 
ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే నీకేం కాదు.. మేం ఇంటి దగ్గర సేఫ్‌గా దిగబెడతాం అని భరోసా ఇవ్వ లేమా? అని ప్రశ్నిస్తాడు దర్శకుడు. ‘క్వీన్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిం చిన ఈ చిత్రంలో ఆలియా భట్ నటించారు.  

అహల్యను టచ్ చేస్తే..!
ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. ఆవిడకు ఓ పాతికేళ్లుంటాయ్. ఆ ఇంట్లోకి వచ్చినవాళ్లు వచ్చినట్లు మాయమైపోతారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఓ పోలీసాఫీసర్ ఆ ఇంటికి వెళతాడు. వయసులో ఉన్న అమ్మాయిని చూసి, మోహిస్తాడు. మాటల మధ్య ఆ ముసలాయన ఓ రాయిని చూపిస్తూ, దీన్ని టచ్ చేసి, మేడ పైకి వెళ్లి, ఆ అమ్మాయికి సెల్‌ఫోన్ ఇచ్చినవాళ్లు తనలా మారిపోతారని చెబుతాడు.

ఆఫీసర్ ఆశ్చర్య పోతాడు. రాయిని టచ్ చేసి, మొబైల్ తీసుకుని పెకైళ్తాడు. అహల్య అతణ్ణి తన భర్తే అనుకుని, చేతులు చాచి రమ్మంటుంది. అప్పుడేమైంది? ‘కహానీ’ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ ‘అహల్య’ను తెరకెక్కించారు. అహల్యగా రాధికా ఆప్టే నటించారు. దీన్ని థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంతో నెటిజన్లు ఫిదా.
 
వ్యసనాలకు బానిసైతే...
అతను ఓ ఫొటోగ్రాఫర్...  భార్య, ఓ కొడుకుతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆ  ఫొటోగ్రాఫర్‌కు అమ్మాయిల పిచ్చి. ఫొటోలు దిగడానికి వస్తున్న మోడల్స్‌తో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పాపం.. భార్యే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కొడుకు పెద్దవాడవుతాడు. అతనూ ఫొటోగ్రాఫర్ అవుతాడు. కాలం గడుస్తుంది.

ఇంతలో ఆ కొడుక్కి తల్లి దగ్గర నుంచి ఫోన్.. తండ్రికి ఎయిడ్స్ వచ్చిందని. వెంటనే బయలుదేరి వస్తాడు. తల్లి బతిమా లడంతో హాస్పిటల్లో ఉంటున్న తండ్రిని దగ్గరుండి చూసుకుంటాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఆఖరి రోజుల్లో తండ్రిని కంటికి రెప్పలా కాపాడు కుంటాడు. ‘పాజిటివ్’  పేరుతో బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో ఎయిడ్స్ రోగిగా బొమన్ ఇరానీ, ఆయన భార్య పాత్రలో షబానా అజ్మీ నటిం చారు. ఒక వ్యసనం అందమైన కుటుంబంలోని సంతోషాలను ఎలా దూరం చేసింది? అనే అంశాన్ని కళ్లకు కట్టారు ఫర్హాన్ అక్తర్.
 
నేను నేనులా ఉంటా!
మహిళలు అంతరిక్షంలోకి అడుగుపెట్టినా, ఇంకా వంటింటి కుందేళ్లు అనే భావన ఉన్న మగవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ భర్త  ఉద్యోగం చేస్తానన్న తన భార్యను వద్దంటాడు. అప్పుడు ఆ మహిళ దృఢంగా తీసుకున్న నిర్ణయం, చెప్పిన జవాబు నేపథ్యంలో వచ్చిన షార్ట్‌ఫిల్మ్ ‘డైయింగ్ టు బి మి’. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో గాయని స్మిత కథానాయిక.
 
సుకుమార్ దర్శకత్వంలో ఏడాది క్రితం అల్లు అర్జున్ ‘అయామ్ దట్ ఛేంజ్’ అని షార్ట్‌ఫిల్మ్ చేయగా, ఇప్పుడు సెలబ్రిటీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ భావ వ్యక్తీకరణకు సినిమా కన్నా దగ్గరి దారిగా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇవన్నీ నెట్‌లో హల్‌చల్ చేస్తూ, లక్షలాది వీక్షకులను సంపాదించడం విశేషం. హిట్లతో పాటు జనం మనసులోనూ ఆలోచన రేపితే, ఈ ‘షార్ట్’ కట్ ఫలించినట్లే!
 
నో లైఫ్ కాదు... లైఫ్ ఎగైన్
క్యాన్సర్ భయంకరమైన వ్యాధే కావచ్చు, కానీ క్యాన్సర్ తర్వాత నో లైఫ్ కాదు...ై‘లెఫ్ ఎగైన్’ అని అంటున్నారు సీనియర్ నటి గౌతమి. ఓ యువతి జీవితం క్యాన్సర్ బారిన పడి  ఎలా నలిగిపోయి, కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్న  కథాంశంతో తెరకెక్కిన లఘుచిత్రం ‘లైఫ్ ఎగైన్’. హైమారెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, ఈ లఘుచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గౌతమి కీలక పాత్ర పోషించారు. కేన్సర్ వచ్చాక దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ లఘు చిత్రం ట్రైలర్‌ను ఎంపీ కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement