నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ
తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ..
మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. వంగవీటి సినిమా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిలను విజయవాడలో కలిసి వచ్చిన తర్వాత నేరుగా మీడియాతో అయితే మాట్లాడలేదుగానీ, ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. 'మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదు. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను మాత్రం వెనక్కి తగ్గను.. ఏం జరుగుతుందో చూడాలి. నేను సీరియస్ వార్నింగ్లు చాలా చూశాను. కానీ తొలిసారిగా నవ్వుతూనే వార్నింగ్ ఇవ్వటం చూశాను. డేంజరస్. అయినా వంగవీటి సినిమా విషయంలో నా ఆలోచనలపై వెనక్కి తగ్గను. ఏమవుతుందో చూడాలి. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు. కానీ రాధ రంగా మిత్రమండలి సభ్యులు చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లను నేను ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించాను' అంటూ కామెంట్ చేశారు.
సంతృప్తి చెందలేదు: రాధా
సినిమా విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన వివరణతో సంతృఫ్తి చెందలేదు. 'మా అభ్యంతరాలను వర్మకు తెలియజేశాం.. అదే విషయాలపై కోర్టుకు వెళ్లాం, సినిమా అభ్యంతరకరంగా ఉంటే అంగీకరించం. ఇక ఆయన ఇష్టం' అన్నారు.
ఎవరూ వెనక్కి తగ్గలేదు: కొడాలి నాని
ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. 'వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదు. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మే' అని ఆయన అన్నారు.