
తెరపై పుల్లెల గోపీచంద్ ప్రయాణం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయో పిక్ తెరకెక్కనుంది. రియో ఒలింపిక్స్లో పివి సింధు వెండి పతకం గెలవడంతో ఆమె గురువైన గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎంతోమంది క్రీడాకారుల కెరీర్ను తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరించనున్నారు. గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నారు. ఈ మేరకు సుధీర్ బాబు మాట్లాడుతూ.. 'గోపీచంద్ నిజమైన హీరో. అతని కథ ప్రపంచానికి తప్పకుండా తెలియాలి. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను. గోపీతో కలిసి డబుల్స్ కూడా ఆడాను. ఆయన పాత్రకు సరిపోతానని భావిస్తున్నాను' అని చెప్పారు.
గోపీచంద్కు ఈ విషయం తెలిపినప్పుడు ఆయన అయిష్టంగా ఉన్నారని, అయితే తప్పకుండా అందరికీ తెలియజేయాల్సిన ప్రయాణం అని అందరూ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారని సుధీర్ బాబు తెలిపారు.18 నెలల క్రితమే కథపై కసరత్తు మొదలుపెట్టగా.. ఈ నవంబరులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్, లక్నో, బెంగుళూరు, బర్మింగ్ హామ్లలో జరగనుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'బయో పిక్' ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖుల జీవితాలను, లక్ష్య సాధనలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.