
గాయత్రీ రఘురాం
తమిళసినిమా: నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను నటి గాయత్రీ రఘురాం తీవ్రంగా ఖండించింది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో వ్యవహారం రోజూ ఏదో ఒక గొడవకు తెరలేపుతోంది. బిగ్‌బాస్ గేమ్ షోకు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోని మహిళలకు క్లాస్ తీసుకున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై నటి గాయత్రీ రఘురాం కమల్‌ను విమర్శించింది. మహిళలు సిగరెట్లు కాల్చడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాల గురించి కమలహాసన్ స్పందిస్తూ, మగవాళ్లు చేసే పనులు మహిళలు చేయకూడదని, మనకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నటి గాయత్రీ రఘురాం తప్పు పట్టింది.
దీని గురించి ఆమె బుధవారం తన ట్విట్టర్‌లో పేర్కొంటూ మహిళలు సిగరెట్లు కాల్చడం వల్ల మగవారి కంటే గొప్పవారిగా వారు భావించడం లేదని, మగవారి లానే మహిళలు మానసిక ఒత్తిడి, మనోవేదన కారణంగానే సిగరెట్లు కాలుస్తున్నారని, అయితే ఈ అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడేనని పేర్కొంది. అయితే మగవారు గొప్పవారని, స్త్రీలు వారిని కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమలహాసన్ మాట్లాడడం సరికాదని ఘాటైన విమర్శలు చేసింది. గాయత్రీ గత ఏడాది బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్నదన్నది గమనార్హం.
