
విజయ్ దేవరకొండ గీతా గోవిందం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రిఫ్రెష్‌మెంట్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్న అంచనాలను దర్శకుడు పరుశురాం(బుజ్జి) అందించాడు. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కావటంతో ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ సైతం మెప్పించే విధంగా ఉంటుందన్న టాక్ నడిచింది. అయితే నిన్న రిలీజ్ అయిన ‘వాట్ ద ఎఫ్ సాంగ్’ తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పించారు. పురాణాల ప్రస్తావన తెస్తూ సాగిన పాటపై కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికితోడు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ కావటంతో యూట్యూబ్ నుంచి చివరకు ఆ పాటను తీసేశారు. అయితే ఈ పాటపై రచయిత శ్రీ మణి క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు ప్రజలందరికీ నమస్సుమాజంలి. ఈ రోజు విడుదలైన గీత గోవిందం లో ‘అమెరికా గాళ్ అయినా..’ అనే పాటలోని కొన్ని వాక్యలు కొంత మంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు రావటం జరిగింది. కానీ, మా భావనని తప్పుగా అర్థం చేసుకోవటం జరిగింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు...
..ఏది ఏమైనప్పటికీ అందరి మనోభావాలను గౌరవించటం మా ప్రాథమిక ధర్మం. ఆ కారణం చేత మేం సదరు పాటలోని అభ్యంతరకర పంక్తులను తొలగించి తిరిగి రచించిన ఆ పాటను యూ ట్యూబ్‌లో తిరిగి అప్ లోడ్ చేస్తామని తెలిజయేస్తున్నాం’ అంటూ శ్రీ మణి పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగష్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment