ఆయన బలవంతం మీదే పాటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి
‘‘నేను 20 మంది వరకూ సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేశాను. అయితే నా జీవితాన్ని మలుపు తిప్పిన గురువులంటే మాత్రం నలుగురి పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. వాళ్లల్లో అగ్రతాంబూలం ఇవ్వాల్సింది. రమేశ్ మాస్టారికి. ఆయన అంధుడు. కానీ సంగీత సరస్వతీ పుత్రుడు. ఆయన సమక్షం... ఏదో రాగాల ఖజానాలా అనిపించేది. చిన్నప్పుడే నాలో సంగీతం పట్ల ఓ ఆపేక్షను తీసుకొచ్చింది ఆయనే.
కర్ణాటక సంగీతం గురించి, రాగాల గురించి నాకెంతో విశ్లేషించి చెప్పారు. నా శ్రద్ధ, తపన చూసి మిగతా వాళ్ల కన్నా నాతోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయించేవారు. మాండలిన్, హార్మోనియంతో రాగాలు వాయిస్తూ పాటలు పాడమనేవారు. నాకేమో పాటలు పాడడం అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయినా కూడా ఆయన బలవంతంగా నన్ను పాడుతూ ప్రాక్టీస్ చేయమనేవారు. ఆ ప్రక్రియే ఇప్పుడు నాకు తిండి పెడుతోంది. ఆయన శిక్షణ వల్లనే నేను ట్యూన్స్ పాడగలుగుతున్నాను.
అందుకే జీవితాంతం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అయితే బాధ కలిగించే విషయం ఏమంటే - నా ఎదుగుదల చూడకుండానే ఆయన కాల ధర్మం చెందారు. ఇక నా మరో గురువు జాకబ్ జాన్. సీనియర్ మ్యుజీషియన్. ఆయన దగ్గర వెస్ట్రన్, క్లాసికల్ నేర్చుకున్నాను. నా మూడో గురువు మా నాన్నగారైన వైఎన్ శర్మగారు. నా సంగీత ప్రయాణంలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇళయరాజాగారు. ఆయనకు నేను ఏకలవ్య శిష్ణుణ్ణి’’.
- మణిశర్మ