
చలపతిరావు వ్యాఖ్యలపై స్పందించిన హేమ
హైదరాబాద్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావును క్షమించాలని నటి హేమ కోరారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పినందున ఆయనపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆడియో ఫంక్షన్‌లో మహిళలకు చలపతిరావు మాట్లాడింది తప్పేనని, ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మంచి పనిచేశారని పేర్కొన్నారు. ఇక నుంచి ఎవరైనా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకుంటారన్నారు.
సీనియర్ నటుడైన చలపతిరావు సరదాగా మాట్లాడతాడు కానీ, ఎప్పుడూ నోరు జారలేదని తెలిపారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంస్కారవంతంగా క్షమాపణలు అడిగారని, ఆయనపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలని హేమ కోరారు. సోషల్ మీడియాలో రాసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆడవాళ్ల గురించి పిచ్చిరాతలు మానుకోవాలని సూచించారు. వెబ్ మీడియా తీరు మారాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలను కించే పరిచేలా మాట్లాడడం సరికాదని హేమ అభిప్రాయపడ్డారు.