
ఈ కాలంలో హీరోలకు ధీటుగా డాన్స్ చేసే హీరోయిన్ ఎవరూ... అంటే టక్కున గుర్తుకు వచ్చే సమాధానం మిల్కీబ్యూటి తమన్నా. ఈ టాలెంట్ వల్లే ఆమెకు పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం దక్కుతుంది. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమాలో ‘స్వింగ్ జర’ పాటకు యంగ్ టైగర్‌కు ధీటుగా ఈ బ్యూటీ చేసిన డాన్స్ చూస్తే ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు.
ఆమెకు పారిస్‌కు చెందిన ప్రముఖ డీజే(డిస్క్ జాకీ) స్నేక్ ఓ ఛాలెంజ్ విసిరారు. తాను నటించిన ‘మెజెంటా రిడిమ్’ పాటకు డ్యాన్స్ చేయాలని తమన్నాతో ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు తమన్నా ఒప్పుకోవడమే కాక బ్రహ్మండంగా డాన్స్ చేసి మరి ఛాలెంజ్ నెగ్గారు. వెస్ట్రన్, ఇండియన్ స్టెప్పులతో తమన్నా వేసిన ఈ డాన్స్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. ‘డీజే స్నేక్ కోసం ‘మెజెంటా రిడిమ్’ ఛాలెంజ్‌కు ఒప్పుకొన్నా. జూయీ వైద్య ఈ పాటకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా ఈ వీడియోను లైక్ చేశారు.
తమన్నా, స్నేక్ మంచి స్నేహితులు. ‘మెజెంటా రిడిమ్’ పాటను కంపోజ్ చేయడానికి ఇటీవల స్నేక్ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో తమన్నా స్నేక్‌కు స్వయంగా దగ్గరుండి ‘బాహుబలి’ సినిమాను చూపించారు. స్నేక్ ఈ సినిమా చూసి ‘భారతీయ సంస్కృతి, డాన్స్‌లు నాకెంతో స్ఫూర్తినిస్తాయి’ అని పేర్కొన్నారు. కల్యాణ్ రామ్‌కు జోడీగా తమన్నా నటించిన ‘నా నువ్వే’ చిత్రం త్వరలో విడుదలకానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’, ‘క్వీన్’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment