నచ్చినట్టు తీశాను
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ తొలిసారిగా నిర్మించిన హైవే కాసుల వర్షం కురిపిస్తోంది. సొంత సినిమా అయినప్పటికీ స్క్రిప్టు ప్రకారం కాకుండా, మనసుకు నచ్చినట్టు సన్నివేశాలు తీశానని, తను చేసిన సాహసం వృథా కాలేదని అన్నాడు. రణ్‌దీప్ హుడా, ఆలియాభట్ జోడీగా వచ్చిన ఈ సినిమాను రూ.18.25 కోట్ల ఖర్చుతో నిర్మించగా, మొదటి వారంలోనే రూ.22.38 కోట్లు సంపాదించిపెట్టింది.
‘హైవే సినిమాతో నేను ఒక కొత్త రకం విత్తనాన్ని నాటాను. నిబంధనలను పట్టించుకోలేదు. ఎలా తీయాలనిపిస్తే అలా తీశాను. నా సినిమా సంకుచితంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. బాగాధైర్యం చేసి ఈ కొత్త తరహామార్గాన్నిఎంచుకున్నా..చివరికి విజయం సాధించాను’ అని అలీ వివరించాడు.
స్క్రిప్టు లేకుం డా సినిమా మొదలుపెట్టాం కాబట్టి అనుకున్నట్టుగా సినిమా రాకుంటే మధ్యలోనే షూటింగ్‌ను ఆపేయాలని ఇతడు మొదటే నిర్ణయించుకున్నాడు. దీనికితోడు ఇది వరకు తీసిన రాక్‌స్టార్ పెద్దగా విజయం సాధించకపోవడం కూడా ఇందుకు కారణం. ‘సినిమా కోసం సాజిద్ నడియద్‌వాలా నుంచి అప్పులు తీసుకున్నాను. ఎలాగొలా చెల్లించగలుగుతానన్న నమ్మకం ఉండేది. డబ్బు లేకపోతే ఆయన దగ్గర పని చేసి అప్పు తీర్చుదామని కూడా అనుకున్నాను’ అని వివరిం చాడు. హైవే హిట్ అయిందని అలీ మౌనంగా ఏమీ ఉండ డం లేదు. అన్ని నగరాల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు.
కథ, రణ్‌దీప్, ఆలియా ప్రేక్షకులకు బాగా నచ్చారని అన్నాడు. ఇక ఈ దర్శకుడు తాజాగా రణ్‌బీర్ కపూర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. కథ కొంత భాగాన్ని సిద్ధం చేసినా.. కంప్యూటర్‌లో సాంకేతిక సమస్య రావడంతో మొత్తం తొల గిపోయిందని, ఇప్పుడు మొదటి నుంచి మళ్లీ రాస్తున్నానని ఇంతియాజ్ అలీ వివరించాడు.