హాలీవుడ్‌ మాస్‌ బొమ్మ@2018 | hollywood movies 2018 special | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ మాస్‌ బొమ్మ@2018

Published Sun, Jan 7 2018 11:50 PM | Last Updated on Mon, Jan 8 2018 3:56 AM

hollywood movies 2018 special - Sakshi

ఎక్కణ్నుంచో ఏదో వెంట పడుతున్నట్లు ఉంటుంది. అందరూ పరిగెడుతూ ఉంటారు. అడవి. ఎటుపోవాలో తెలీదు. తప్పించుకోవాలి. పోరాటాలు చేస్తూనే ఉంటారు. హీరోలు వాళ్లు. భయపెట్టే జంతువులు అవి. ఎన్నేళ్లుగా చూస్తున్నాం ఈ కథలు, ఆ జంతువులకు డైనోసర్‌ అన్న పేరు పెట్టుకొని. సగటు ఇండియన్‌ సినిమా అభిమానికి హాలీవుడ్‌ అంటే ఇదీ! విజిల్స్‌ వేయించే మాస్‌ బొమ్మ.

అలాంటి ‘జురాసిక్‌ పార్క్‌’ వింతలు కావాలి మనకు. ‘స్పైడర్‌మేన్‌’ సాహసాలు కావాలి. ఎప్పుడు ఏ కారు గాల్లోకి ఎగురుతుందో తెలియని యాక్షన్‌ కావాలి. నోరెళ్లబెట్టి కూర్చునేలా చేసే బొమ్మ కావాలి. హాలీవుడ్‌లో ఎన్నెన్ని సినిమాలు వచ్చినా, ఇలాంటి పక్కా బాక్సాఫీస్‌నే టార్గెట్‌ చేసుకొని వచ్చే మాస్‌ బొమ్మలకు ఉండే క్రేజ్‌ వేరు. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేసేందుకు అన్ని హంగులతో కొన్ని మాస్‌ సినిమాలు వస్తున్నాయి. ఈ వారం ఆ సినిమాలేంటో చూసొద్దాం..

జురాసిక్‌ వరల్డ్‌ ఫాలెన్‌ కింగ్‌డమ్‌
‘జురాసిక్‌ పార్క్‌’ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. డైనోసర్లు ఈసారి మరింత విజృంభించినట్లు ట్రైలర్‌ చూస్తే స్పష్టమైపోతోంది. 2015లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌’.. అభిమానుల్లో ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో తెలియజేసింది. ఇక ఇప్పుడొస్తున్న కొత్త సినిమా బాక్సాఫీస్‌ వద్ద డైనోసర్‌ మోత మోగిస్తుందన్న టాక్‌ అప్పుడే వినిపిస్తోంది. నిజంగా మాస్‌ ఆడియన్స్‌కు పండగ అంటే ఈ సినిమా అనే చెప్పుకోవాలి. జూన్‌ 22న జురాసిక్‌ వరల్డ్‌ విడుదల కానుంది.

అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌
ఈ ఏడాది అన్నింటికంటే ఎక్కువ హైప్‌ ఈ సినిమాకే ఉందని చెప్పాలి. అవెంజర్స్‌కి ఉన్న క్రేజ్‌ అనుకోవచ్చు, ట్రైలర్‌తో అదరగొట్టడం కావొచ్చు.. అవెంజర్స్‌ కోసం అభిమానులంతా పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్‌ సినిమా అభిమానులకు ట్రీట్‌లా ఉంటుందట ఈ సినిమా. కమర్షియల్‌ సినిమా అభిమానులూ.. సమ్మర్‌లో..  ఏప్రిల్‌ 27న వస్తోందీ సినిమా!!

మిషన్‌ ఇంపాజిబుల్‌ 6
యాక్షన్‌ సినిమా అభిమానుల ఫేవరెట్స్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ తప్పక ఉంటుంది. ఈసారి ఆ యాక్షన్‌ ఇంకెక్కువే ఉంటుందట. ఒక్కో సీక్వెల్‌కు స్టైల్‌ను, యాక్షన్‌ను పెంచుతూ పోతోన్న ఈ సిరీస్, ఈసారి కమర్షియల్‌ సినిమా అభిమానిని అలా కూర్చొబెట్టి కట్టిపడేస్తుందట. జూలై 27కు విడుదలవుతుంది ఈ సినిమా.

స్పైడర్‌మేన్‌ ఇన్‌టు ది స్పైడర్‌ వర్స్‌
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కట్టిపడేసే సూపర్‌హీరో స్పైడర్‌మేన్‌ కూడా ఈ ఏడాది చివర్లో సందడి చేయడానికి వస్తున్నాడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 14న విడుదల కానుందీ సినిమా. విడుదలకు ఇంకా చాలా టైమ్‌ ఉండడంతో పక్కా కమర్షియల్, సూపర్‌హిట్‌ అవుట్‌పుట్‌నే బయటకు తీసుకొస్తున్నారట.

బ్లాక్‌ప్యాంథర్‌

మార్వెల్‌ స్టూడియోస్‌ సృష్టించిన బ్లాక్‌ప్యాంథర్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్‌హీరో క్యారెక్టర్లో ఇదొక డిఫరెంట్‌ స్టైల్‌. 2016లో వచ్చిన ‘కెప్టెన్‌ అమెరికా : సివిల్‌ వార్‌’ (2016)లో బ్లాక్‌పాంథర్‌ క్యారెక్టర్‌కు రెట్టింపు ఎనర్జీతో ఇప్పుడు కొత్తగా వస్తోన్న క్యారెక్టర్‌ ఉంటుందట. ఫిబ్రవరి 16న వస్తోన్న ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌తో అద్భుతమైన సినిమాటిక్‌ ఫీల్‌ ఇస్తుందని హాలీవుడ్‌ టాక్‌.

ఇవే కాకుండా ‘ఎక్స్‌–మెన్‌ డార్క్‌ ఫియొనిక్స్‌’, ‘అక్వామేన్‌’, ‘ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌’, ‘ది ప్రిడేటర్‌’, ‘యాంట్‌మేన్‌’ లాంటి సూపర్‌ డూపర్‌ కమర్షియల్‌ సినిమాలు కూడా ఈ ఏడాదే సందడి చేయనున్నాయి. హాలీవుడ్‌ మాస్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ ఏడాది కావాల్సినన్ని సినిమాలున్నాయి మరి, చూడడానికి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement