అమాయక పాత్రలు ఇక వద్దు
అమాయక పాత్రలు ఇక వద్దు అంటోంది నటి సురభి. కలలు కనడం సాధారణమే వాటిని సాధించుకోవడం మాత్రం అంత సులభం కాదు. వర్ధమాన తార సురభి నటిగా చాలానే ఆశపడుతోంది. ఈ భామ ఏకంగా వీరనారి ఝాన్సీరాణిగా నటించాలని కోరుకుంటోంది. ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందిన విజయశాంతి నుంచి చాలా మంది నటీమణులు ఝాన్సీరాణిగా తెరపై కనిపించాలని ఆశించారు. అయితే వారెవరి కోరిక నెరవేరలేదు.
ఇప్పుడు నటి సురభి అలాంటి అసాధారణ కోరికనే వ్యక్తం చేస్తోంది. ఇవన్ వేరమాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన సురభి ఆ తరువాద వేలై ఇల్లా పట్టాదారి చిత్రాల్లో నటించినా అంతగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అవకాశాలు బాగానే ఉన్నాయట. దీని గురించి సురభి మాట్లాడుతూ ఇవన్‌వేరమాదిరి చిత్రంలో పక్కింటి అమ్మాయిలా చాలా ఇన్నోసెంట్ పాత్రను పోషించానని, అదే విధంగా పుగళ్ చిత్రంలో ఆత్మ విశ్వాసం కలిగిన ధైర్యవంతురాలి పాత్రలో నటించినట్లు చెప్పింది.
అయితే ఇక నటనకు అవకాశం ఉన్న పాత్రలోనే నటించాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. ఇవన్‌వేరమాదిరి చిత్రంలో మాదిరిగా ఇన్నోసెంట్ పాత్రలు వద్దని అంది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా తెలుగులో చేతినిండా చిత్రాలు ఉన్నాయని తెలిపింది. అక్కడి వారు చాలా ప్రేమగా మసలుకుంటున్నారని చెప్పింది. అయితే చెన్నైను చాలా మిస్ అవుతున్నానని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర లభిస్తే తమిళంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హిందీ చిత్రం బాజీరావు మస్తానీ లాంటి చారిత్రక కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానంది. ముఖ్యంగా ఝాన్సీరాణి పాత్రను పోషించాలని ఆశిస్తున్నట్లు సురభి తన కోరికను వ్యక్తం చేసింది.