'పారితోషికం నచ్చితేనే ఓకే చెప్పండి'
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లకు ఓ హీరో బాసటగా నిలుస్తున్నాడు. హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన వేతనాలు చెల్లించాలని పేర్కొన్నాడు. సమాన వేతన చట్టం తరహాలో ఏదైనా ఓ విధానం రావాలని కోరుకుంటున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్. 'పార్క్ అవెన్యూ' ప్రాడక్ట్ లాంచ్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న అక్తర్ కొన్ని విషయాలను ప్రస్తావించాడు. 'బాగ్ మిల్కా బాగ్'తో తనకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. హీరోల స్థాయిలో తమకు పారితోషికాలు అందించాలంటూ హీరోయిన్లు అడగుతున్నారని చెప్పాడు.
తాము ఎందులోనూ తక్కువ కాదని, సమాన పారితోషికం ఇవ్వాలని హీరోయిన్లు కోరుకుంటున్నారు.. ఇందుకు తాను మద్దతు ఇస్తానన్నాడు. ఒకవేళ తన సినిమాలలో నటించే హీరోయిన్లు అడిగితే వారికి తగిన పారితోషికం ఇవ్వడం ఇష్టమేనన్నాడు. నిర్మాతలు ఇస్తున్నది తగిన పారితోషికం కాదని వారు భావిస్తే ఆ సినిమాలకు నో చెప్పడం మంచిదంటూ సూచించాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, ఇష్టం ఉన్నవారు తన సలహా ఫాలో అవ్వొచ్చని చెప్పాడు. ఆడ, మగ అనే భేదం లేకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నైపుణ్యం ఉన్న నటీనటులు ఉన్నారని ఫర్హాన్ చెప్పుకొచ్చాడు.