
ఆ బంధంలో ఏదో మహత్తు ఉంది!
‘‘ఇద్దరు అపరిచితులు పెళ్లి చేసుకోవడం చాలా తమాషా అయిన విషయం. అసలు.. అభిరుచులు, మనస్తత్వం తెలియకుండా అకస్మాత్తుగా ఓ బంధం ఏర్పరచుకుని జీవితాంతం ఎలా ఉంటారబ్బా అనుకునేదాన్ని. ఇలా ఆలోచించడంవల్లనో ఏమో ఒకప్పుడు నాకు పెళ్లంటే పరమ అసహ్యంగా ఉండేది’’ అని ఇలియానా చెప్పారు. కానీ, ఇప్పుడు అసహ్యం స్థానంలో ఇష్టం ఏర్పడిందట.
దాని గురించి ఇలియానా చెబుతూ -‘‘వయసు పెరిగే కొద్దీ మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాల మీద నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అలా నాకు వివాహ బంధం మీద సదభిప్రాయం ఏర్పడింది. ఈ బంధంలో ఏదో మహత్తు ఉంది. అందుకే, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనే నా నిర్ణయాన్ని మార్చేసుకున్నాను’’ అని చెప్పారు. ఇంతకీ, త్వరలోనే మీ పెళ్ళట కదా అని అడిగితే... ‘మీ అందరికీ చెప్పే చేసుకుంటా’ అని ఇలియానా నవ్వుతూ బదులిచ్చారు.