నన్ను మన్నించండి!
‘‘ఆయన టాలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్. శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన డైరెక్షన్ చేసిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతోనే నేను తెలుగుకి పరిచయమయ్యాను. వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించారాయన. తన సినిమాల్లోని పాటల్లో కథనాయికల నడుము మీద పండ్లు, పువ్వులు వేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు’’ అని ఇటీవల ఓ హిందీ కామెడీ షోలో దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గురించి తాప్సీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తొలి సినిమాకి అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర రావు గురించి తాప్సీ ఇలా మాట్లాడటాన్ని కొంతమంది విమర్శించారు. దీని గురించి తాప్సీ స్పందిస్తూ– ‘‘నటిగా రాణించుగలుగుతున్నానంటే రాఘవేంద్రరావుగారే కారణం. ఆ విషయాన్ని నా లైఫ్‌లో మరచిపోను. ఆయన్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశానని కొందరు నిందిస్తున్నారు. ఎవరినీ తక్కువ చేసేలా నేను మాట్లాడలేదు. ఒకవేళ నా మాటలు ఎవర్నైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. అవి నాపై నేను జోక్ వేసుకుని నవ్వించాలని చేసిన వ్యాఖ్యలే తప్ప, ఇతరుల మనోభావాలను దెబ్బ తీయాలని కాదు. నా మాటలు తప్పనిపిస్తే మన్నించండి’’ అన్నారు.