నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్!? | In memory of actress bhanumathi ramakrishna | Sakshi
Sakshi News home page

నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్!?

Published Sat, Sep 7 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్!?

నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్!?

ఆత్మాభిమానానికి చీరకడితే ఎలా ఉంటుంది? అని ఆ మధ్య ఓ పెద్దాయన్ను అడిగితే... అచ్చు భానుమతిలా ఉంటుందని అన్నాట్ట.  ఆ సమాధానంలో ఆవగింజంత కూడా అతిశయోక్తి లేదు.  కొండంత అభిమాన ధనం, ఆకాశమంత అభిమాన గణం వెరసి భానుమతి రామకృష్ణ. విషయపరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ మాటను అంగీకరించాల్సిందే.  
 
 ‘నా పక్క హీరోలు అనిపించుకునేంత కెపాసిటీ మీ ఇద్దరికి గాక ఎవరికుంది’ అని నాటి అగ్ర హీరోలను సైతం ప్రశ్నించేంత అభిజాత్యం భానుమతి సొంతం. దానికి తగ్గట్టు ఆ ఇద్దరు హీరోలు కూడా భానుమతి విషయంలో కాస్తంత నమ్రతగానే ఉండేవారట. 
 
 నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతిలోని బహుముఖ ప్రజ్ఞ తెలియని వారు చాలా అరుదు. అలాగే... భానుమతిలోని అసలైన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు కూడా చాలా అరుదే. పెళుసుగా ఉండే ఆ మాట తీరు, గంభీరమైన ఆ ఆహార్యం, రాజసం ఉట్టిపడే ఆ నవ్వు... ఇవన్నీ చూసి.. ‘అహంభావం.. గర్వం.. పొగరు..’ అనేవారు చాలామంది ఉన్నారు. అసలు ఆ మాటకొస్తే... సరస్వతికి ప్రతిరూపమైన భానుమతికి అవన్నీ ఉండటంలో తప్పేంటి? అవన్నీ ఆమెకు ఆభరణాలే. నిజానికి అహంభావిలా కనిపించే ఆ మహాకళాకారిణి మనసు చాలా సున్నితం. 
 
 అప్పట్లో ఓ తుంటరి జర్నలిస్ట్... కెరీర్ ప్రారంభంలోనే తనలోని ఫైర్ చూపించేద్దామని ఇంటర్‌వ్యూలో తొలి ప్రశ్నే...  ‘మీకు పొగరంటగా?’ అని భానుమతిని అడిగాట్ట. ‘నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్’ అని ఆ జర్నలిస్ట్‌ని ఎదురు ప్రశ్నించి... అతని ఎక్స్‌ప్రెషన్ మారగానే... పకపకా నవ్వేశారట భానుమతి. ఆమెలోని చిలిపితనానికి ఇదొక ప్రతీక. 
 
 అదే పత్రికకు భానుమతి ఓ కథ రాసి ఇచ్చారు. దానికి ఇదే జర్నలిస్ట్‌గారు అందరితో పాటే పారితోషికం కింద ఇరవై రూపాయలు భానుమతికి మనియార్డర్ చేశాట్ట. సదరు పత్రికాధినేత వద్దని వారిస్తున్నా... ‘అంతపెద్ద సూపర్‌స్టార్‌కి, రచయిత్రికి.. ఇంత తక్కువ మొత్తాన్ని మనియార్డర్ చేయడం అవమానించినట్టవుతుంది’ అని మొత్తుకుంటున్నా.. లెక్క చేయకుండా మనియార్డర్ చేశాట్ట ఆ డేరింగ్ జర్నలిస్ట్. రెండో రోజు... ఆ పత్రికా కార్యాలయానికి ఫోన్ రింగ్ అయ్యింది. ఆ జర్నలిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల భానుమతి. జర్నలిస్ట్ గుండె గుభేల్. ‘ఇరవై రూపాయలు మనియార్డర్ పంపి నన్ను అవమానిస్తావా? ఎంత పొగరు నీకు’ అంటూ చడామడా తిట్టేస్తారని తత్తరపడిపోయాడు ఆ జర్నలిస్ట్. కానీ భానుమతి గొంతులో అతననుకున్నంత ఆవేశం లేదు. 
 
 కొండంత ఆనందం గోచరిస్తోంది. ‘థ్యాంక్సండీ.. లక్షలు పారితోషికం తీసుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. నా కథకు మీరందించిన ఇరైవె  రూపాయల పారితోషికం నాకు కోటి రూపాయల పెట్టు. ఇప్పుడే ఆ ఇరవై రూపాయలతో షాపింగ్ చేసేశాను. రెండు జాకెట్ ముక్కలు కొనుక్కున్నాను. మా వారికి నాలుగు కర్చీఫ్ తీసుకున్నాను. మా అబ్బాయికి ఓ ఇంక్ బాటిల్ కొన్నాను. థ్యాంక్సండీ’ టకటకా చెప్పేస్తున్నారు భానుమతి. అవతల జర్నలిస్ట్ షాక్. ఇంటర్‌కమ్‌లో సంభాషణ వింటున్న సదరు పత్రికాధినేత కూడా షాక్. భానుమతిలోని అల్ప సంతోషానికి ఇదొక ప్రతీక. 
 
 ఇంతకీ ఆ జర్నలిస్ట్ ఎవరో చెప్పనేలేదు కదూ. ఆయన ఎవరోకాదు. మన ముళ్లపూడి వెంకటరమణ.. 
 సినిమా పుట్టాక... చాలామంది స్త్రీమూర్తులు ఈ రంగంలో రాణించారు. కానీ భానుమతి ఆర్జించిన కీర్తిని, ఆమె సాధించిన ఘనతను మాత్రం ఏ స్త్రీ సాధించలేదన్నది నిర్వివాదాంశం. అందుకే భానుమతి ఎప్పటికీ చిరంజీవే.
 - బుర్రా నరసింహా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement