
ఇషాకు మరో ఛాన్స్
నటి ఇషా తల్వర్ గుర్తుందా? ఆ మధ్య మిర్చి శివతో తిల్లుముల్లు చిత్రంలో జతకట్టింది. ఆ ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకుని మలయాళం తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీకి తాజాగా తమిళంలో మరో అవకాశం వచ్చింది. నటుడు ధనుష్‌తో వరుసగా యారడీ నీ మోహిని, ఉత్తమ పుత్రన్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు జవహర్ కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. మలయాళంలో విజయం సాధించిన తట్టత్తిన్ మరయాదు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మలయాళంలో నటి ఐషా నటించిన పాత్రను తమిళంలో ఇషా తల్వర్ పోషించనుంది. దీనిపై దర్శకుడు జవహర్ తెలుపుతూ మలయాళ చిత్రం తట్టత్తిన్ మరయాదు చిత్రం రీమేక్‌లో ఇషాతల్వర్‌ను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. హీరోగా నూతన నటుడు నటించనున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తన ఉత్తమ పుత్రన్ చిత్రానికి పని చేసిన విష్ణుశర్మ, ఎం.త్యాగరాజన్‌లు ఈ చిత్రానికి చాయాగ్రహణం అందించనున్నట్లు దర్శకుడు తెలిపారు. మొత్తంమీద ఇషా తల్వర్‌కు చాన్నాళ్ల తరువాత కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది.