
కాజల్ అగర్వాల్
ఖాళీ సమయంలో ఏదైనా కొత్త కళ నేర్చుకోవడం ఉత్తమమని అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అందరూ స్వీయ గృహనిర్భందంలో ఉంటున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ – ‘‘ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒక కొత్త కళను నేర్చుకోవడానికే నేను ఇష్టపడతాను. నేను నేర్చుకుంటున్న కొత్త విషయం నాకు నా లైఫ్‌లో ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు.
కానీ టైమ్ వేస్ట్ చేయడం కన్నా ఏదో ఒక కొత్త పనిని సాధన చేయడం ఉత్తమం అని నా భావన. ప్రస్తుతం నేను చెస్ నేర్చుకుంటున్నాను. మార్షల్‌ఆర్ట్స్ (‘ఇండియన్ 2’ సినిమా కోసం) కోసం మరింత సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. మనలో లోపాలుంటే సరిచేసుకోవడానికి ఈ ఖాళీ సమయం ఉపయోగపడుతుంది. గ్యాప్ కూడా మంచికే. ఈ బ్రేక్‌లోనూ ఏదో ఒకటి చేస్తూ బిజీగానే ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబైసాగ’ చిత్రాల్లో నటిస్తున్నారామె.