హీరోయిన్‌పై వేటుకు సిద్ధం?
హీరోయిన్ కాజోల్ మీద వేటు వేసేందుకు ప్రసారభారతి సిద్ధం అవుతోంది. సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమెను తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ. ఇది సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 2016 ఫిబ్రవరి నెలలో కాజోల్‌ను ఈ బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. అయితే గత నాలుగు సమావేశాల నుంచి ఆమె అసలు హాజరు కావడం లేదు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు చెప్పకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని ప్రసారభారతి నిబంధనలు చెబుతున్నాయి.
ముందుగానే ఉన్న వృత్తిపరమైన కమిట్‌మెంట్ల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అన్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో చాలాకాలం పాటు కుటుంబపరమైన వైద్య కారణాలు కూడా అందుకు ఉన్నాయన్నారు. గత కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినందుకు ఆమె కూడా చాలా బాధపడ్డారని తెలిపారు. కానీ బోర్డులోని పలువురు సభ్యులు మాత్రం గత సమావేశంలోనే ఆమె రాకపోవడాన్ని ప్రస్తావించి, కాజోల్‌ను తొలగించాలని అన్నారు. ముందుగా ఆమెకు ఒక నోటీసు పంపుతామని, ఆ తర్వాత ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశాలకు వచ్చేందుకు సభ్యులకు విమాన చార్జీలు, హోటల్ చార్జీలు, ఇతర అలవెన్సులు ఇస్తారు.