హీరోయిన్‌కి 42...హీరోకి 33!
హిందీ హీరోయిన్ కాజోల్ వయసెంతో తెలుసా? అక్షరాల నలభై రెండు ఏళ్ల నాలుగు నెలలు. ఇప్పుడామె ఏ హీరోతో నటించనున్నారో తెలుసా? 33 ఏళ్ల ధనుష్‌కు జోడీగా! ఇద్దరూ జంటగా నటించబోయేది హిందీ సినిమాలో అనుకునేరు. కాదండీ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ‘వీఐపీ-2’లోనే. ఈ సినిమా ధనుష్ హీరోగా వేల్‌రాజ్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘వేలై ఇల్లా పట్టదారి’కి సీక్వెల్. ఇది తెలుగులో ‘రఘువరన్ బీటెక్’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సీక్వెల్‌కి ధనుష్ కథ అందిస్తుండగా.. అతని మరదలు, రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించనున్నారు. హీరోయిన్‌గా నటించమని గత వారమే బావామరదళ్లు కాజోల్‌ను కలసి కథ వినిపించారు.
‘‘కాజోల్‌కు కథ బాగా నచ్చింది. కానీ, డేట్స్ సమస్య వల్ల ఆమె ఇంకా ఏ మాటా చెప్పలేదు. కాజోల్ కోసం డిసెంబర్‌లో మొదలు కావల్సిన షూటింగ్‌ను జనవరికి వాయిదా వేయాలనుకుంటున్నారు. ఈ నెలలోనే ‘వీఐపీ-2’కి ఆమె సంతకం చేయొచ్చు’’ అని సినిమా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాజోల్ ‘వీఐపీ-2’లో నటిస్తే... సుమారు 20 ఏళ్ల తర్వాత ఆమె నటించే దక్షిణాది సినిమా ఇదే అవుతుంది. అరవింద్ స్వామికి జోడీగా 1997లో వచ్చిన తమిళ సినిమా ‘మిన్‌సార కనవు’లో కాజోల్ నటించారు. తెలుగులో ఆ సినిమా ‘మెరుపు కలలు’గా విడుదలైంది.