VIP-2
-
కండిషన్స్ ఆప్లై!
కుర్ర హీరోలతో సీనియర్ హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం బాలీవుడ్లో కొత్తేమీ కాదు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో రణబీర్‌కపూర్‌తో ఐశ్వర్యారాయ్,‘కి అండ్ కా’లో అర్జున్‌కపూర్‌తో కరీనా కపూర్ నటించారు. ఇటీవల ‘విఐపి–2’లో నటించిన కాజోల్‌తో కుర్ర హీరోలతో సీనియర్ నాయికలు రొమాంటిక్ సినిమాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగితే ‘‘ఈ రోజుల్లో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. దర్శకుల విజన్ కూడా మారుతోంది. కుర్ర హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేయడాన్ని తప్పనడంలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ, కొన్ని కండిషన్స్. నాతో నటించబోయే కుర్ర హీరో మ్యాన్లీగా ఉండాలి. అతని ఆలోచనల్లో, యాక్టింగ్‌లో పరిణితి చెంది ఉండాలి. అలాంటి హీరో సరసన ఛాన్స్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను’’ అన్నారామె. -
కోలీవుడ్‌లో అమలాపాల్ మలయాళ చిత్రం
తమిళసినిమా: అమలాపాల్ నాయకిగా నటించిన మలయాళ చిత్రం కోలీవుడ్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. సంచలన నటిమణుల్లో ముందుండే నటి అమలాపాల్ అని అనవచ్చు. వివాహానికి ముందు, విడాకుల తరువాత కూడా నటిగా ఈ అమ్మడికి కథానాయకిగా అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. తమిళంలో ధనుష్‌కు జంటగా నటించిన వీఐపీ–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మరో పక్క బాబీసింహాతో తిరుట్టుప్పయలే–2 చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు మాతృగడ్డపై నవీన్బాలితో రొమాన్స్ చేసిన కాయంకుళం కోచ్‌కన్ని చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇంతకు ముందు మలయాళంలో పళసీరాజా వంటి పలు భారీ చిత్రాలను నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ గోకులం మూవీస్. చాలా ఏళ్లుగా చెన్నైలో గోకులం సిట్ సంస్థను నిర్వహిస్తున్న ఈ సంస్థ నటుడు కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర నిర్మాణంలోనూ భాగం పంచుకుంటోంది. జ్యోతిక కథానాయకిగా 36 వయదినిలే వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రోషన్ ఆండ్రూస్ తాజా చిత్రం కాయంకుళం కోచ్‌కన్ని. చాలా ఏళ్ల క్రితం కేరళలో రాబిన్‌హుడ్‌లా జీవించిన కాయంకుళం కోచ్‌కన్ని అనే వ్యక్తి జీవిత ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంతో నివిన్బాలితో కలిసి అమలాపాల్ నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో మలయాళం, తమిళ భాషల్లో విడుదలకు రెడీ అవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
వీఐపీ–2లో బిగ్‌బాస్ రైసా
తమిళసినిమా : విజయ్ టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొన్న ముద్దుగుమ్మ రైసా విల్సన్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ నటించిన వీఐపీ–2 చిత్రంలో ఒక ముఖ్య భూమికలో నటించింది. అయితే ఆ చిత్రంలో కాజోల్కు సహాయకురాలిగా నటించిన రైసా వీఐపీ–2 ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటిస్తున్నప్పడు రైసా ఎరవనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ షో ద్వారా రైసా అమిత ప్రాచుర్యం పొందింది. అంతేకాదండోయ్ తమిళ తంబిలను ఆకట్టుకునేలా రైసా అందాల ఆరబోత ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘బిగ్‌బాస్’ పుణ్యమా అంటూ అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నట్టు కోలీవుడ్ టాక్. -
హీరో ధనుష్ అబద్ధం చెప్పారు
చెన్నై: హీరో ధనుష్ అబద్ధం చెప్పారని అన్నారు బాలీవుడ్ భామ కాజోల్. హిందీలో క్రేజీ కథానాయికిగా వెలుగొందుతున్న సమయంలోనే ఈ బ్యూటీ మిన్సార కణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయాన్ని సాధించినా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించలేదు. కాగా చాలా కాలం తరువాత ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ–2 చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కాజోల్ ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అది నిజం కాదని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ధనుష్ స్పష్టం చేశారు. ఇందులో కాజల్‌ది తన పాత్రతో సమాంతరంగా సాగే ప్రధాన పాత్ర అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్ మాట్లాడుతూ తాను ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి సాహసించడం లేదన్నారు. అప్పుడెప్పుడో మిన్సారకణవు చిత్రంలో నటించానని, దీంతో వీఐపీ–2 చిత్రంలో నటించడానికి తాను నెర్వస్‌గా ఫీలయ్యానన్నారు. భాష తెలియకపోవడమే అందుకు కారణం అని అన్నారు. ఈ చిత్రం కోసం ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు తన ఇంటికి వచ్చి తమిళంలో మాట్లాడటం గురించి చాలా నేర్పించారన్నారు. తమిళ భాష ఫోబియా నుంచి వారే తనను తప్పించారని అన్నారు. అయినా తమిళంలో సంభాషణలు చెప్పడానికి బుర్ర బద్దలు కొట్టుకున్నానని అన్నారు. కొంచెం తమిళం, ఎక్కువ ఆంగ్ల భాషల్లో డైలాగులు చెప్పేశానని అన్నారు. అయితే తాను తమిళంలో డైలాగులు బాగా చెప్పానని ధనుష్, సౌందర్య రజనీకాంత్‌లు అబద్ధం చెప్పారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీఐపీ–2 చిత్రంలో నటించడం మంచి అనుభవం అని, ధనుష్ ఎక్స్ట్రార్డినరీ యాక్టర్ అని ప్రశంసించారు. సౌందర్య రజనీకాంత్ స్క్రిప్ట్ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవారని కాజోల్ పేర్కొన్నారు. ఇందులో ఆమె కార్పొరేట్ సంస్థ అధికారిణి వసుంధర పాత్రలో నటించారు. కాగా ఈ చిత్ర హిందీ వెర్షన్ కోసం ధనుష్, కాజోల్‌పై ప్రమోషన్ గీతాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం విశేషం. ఈ పాట అదనపు ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. -
అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు
ముంబై: ధనుష్ నటించిన వీఐపీ(రఘువరణ్ బీటెక్) చిత్రం ఎంత విజయం సాధించిందో తెలుసుకదా. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన వీఐపీ-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం వీఐపీ-2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకురాలు సౌందర్యను పాత్రికేయులు.. ఈ చిత్రంలో రజనీ ఉన్నారా అని ప్రశ్నించారు. దీనిపై ఆమె బదులిస్తూ.. స్క్రిప్ట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దర్శకుడు అంతవరకే చెయ్యాలి. వీఐపీ-2 స్క్రిప్ట్ అలాంటిదేమీ డిమాండ్ చేయలేదు. ఈ చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్‌గా రజనీ ఉండాలనే ఆలోచనే మాకు రాలేదని స్పష్టం చేశారు. వీఐపీ-2లో ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. సౌందర్య దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది కాగా.. మొదటిది కొచ్చాడయన్. -
ధనుష్ వీఐపీ-2 వచ్చేస్తోంది
వీఐపీ-2 చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన, నిర్మించిన వేలైఇల్లా పట్టాదారి (వీఐపీ) మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం వీఐపీ-2. ఈ చిత్రంలో అమలాపాల్ నాయకిగా నటించింది. ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ కాజోల్ నటించడం విశేషం. ఇందులో ఆమె ప్రతినాయకిగా నటించారని సమాచారం. కాగా,నటుడు ధనుష్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రానికి సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించారు. సాన్ రోల్డన్ సంగీతాన్ని అందించగా ఇంజినీర్లు తమ హక్కుల కోసం పోరాడే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిసింది. ఇటీవల వండలూర్ సమీపంలోని మణివాక్కంలో 300 మంది ఇంజినీర్లు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. నిర్మాత కలైపులి ఎస్.థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. పా.పాండి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ధనుష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. -
ప్లీజ్... ఆ రెండూ తప్ప!
ప్లీజ్... మీ క్వశ్చన్స్‌లో ఓ రెండిటిని డిలీట్ చేయండి! ఆ రెండిటికీ తప్ప మీరేం అడిగినా ఆన్సర్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు బాలీవుడ్ భామ కాజోల్. ఆమెను మరీ అంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలను ఎవరూ అడగడం లేదు. జస్ట్... కథేంటి? అందులో మీరు చేస్తున్న విలన్ రోల్ ఎలా ఉంటుంది? అనడిగితే ఆన్సర్ చేయడానికి కాజోల్ అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు. కథ, క్యారెక్టర్ గురించి అంత చెప్పకూడని సినిమా ఏదని ఆలోచిస్తున్నారా? ధనుష్ ‘వీఐపీ–2’. ఇందులో కాజోల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. లేడీ విలన్ అనేసరికి అందరిలో ఆసక్తి పెరిగింది. ఆమె క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసుకోవాలని! కానీ, కాజోల్ మాత్రం ఇలా కండీషన్స్ అప్లై అంటున్నారు. ‘వీఐపీ–2’ చిత్రదర్శకురాలు సౌందర్యా రజనీకాంతే ఈ కండిషన్స్ పెట్టారని చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే... ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. -
వీఐపీ–2 పయనం మొదలైంది
వీఐపీ(వేలై ఇల్లా పట్టాదారి) చిత్రం నటుడు ధనుష్ కేరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. అందులో నటించిన నాయకి అమలాపాల్‌కు గుర్తుండిపోయే చిత్రం. కాగా తాజాగా అదే జంట ఈ చిత్రానికి సీక్వెల్లో హీరోహీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలితో రికార్డులు బద్దలుకొట్టిన వీ.క్రియేషన్్స అధినేత కలైపులి ఎస్.థాను, ఎదిర్‌నీశ్చల్, వేలై ఇల్లా పట్టాదారి, కాక్కిసట్టై, మారి, నానూరౌడాదాన్, విచారణై, తంగమగన్, అమ్మాకణక్కు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ధనుష్ వండర్‌బార్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వీఐపీ–2. ఇకపోతే భారతీయ సినిమాకు ఫొటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ 3డీ టెక్నాలజీని పరిచయం చేస్తూ, సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కోచ్చాడయాన్ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు, సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. నటుడు ధనుష్ కథ, సంభాషణలు అందించి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్, శరణ్యా, పోన్ వన్నన్, దర్శకుడు సముద్రఖని, రిషీఖేష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. సమీర్ తాహిర్ ఛాయాగ్రహణ, షాన్ రోనాల్డన్ సంగీతం అందిస్తున్న వీఐపీ–2 చిత్రం షూటింగ్ గురువారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. రజనీకాంత్, లతా దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా వీఐపీ–2 చిత్రాన్ని తమిళం, తెలుగు బాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
హీరోయిన్‌కి 42...హీరోకి 33!
హిందీ హీరోయిన్ కాజోల్ వయసెంతో తెలుసా? అక్షరాల నలభై రెండు ఏళ్ల నాలుగు నెలలు. ఇప్పుడామె ఏ హీరోతో నటించనున్నారో తెలుసా? 33 ఏళ్ల ధనుష్‌కు జోడీగా! ఇద్దరూ జంటగా నటించబోయేది హిందీ సినిమాలో అనుకునేరు. కాదండీ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ‘వీఐపీ-2’లోనే. ఈ సినిమా ధనుష్ హీరోగా వేల్రాజ్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘వేలై ఇల్లా పట్టదారి’కి సీక్వెల్. ఇది తెలుగులో ‘రఘువరన్ బీటెక్’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సీక్వెల్‌కి ధనుష్ కథ అందిస్తుండగా.. అతని మరదలు, రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించనున్నారు. హీరోయిన్గా నటించమని గత వారమే బావామరదళ్లు కాజోల్‌ను కలసి కథ వినిపించారు. ‘‘కాజోల్కు కథ బాగా నచ్చింది. కానీ, డేట్స్ సమస్య వల్ల ఆమె ఇంకా ఏ మాటా చెప్పలేదు. కాజోల్ కోసం డిసెంబర్లో మొదలు కావల్సిన షూటింగ్‌ను జనవరికి వాయిదా వేయాలనుకుంటున్నారు. ఈ నెలలోనే ‘వీఐపీ-2’కి ఆమె సంతకం చేయొచ్చు’’ అని సినిమా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాజోల్ ‘వీఐపీ-2’లో నటిస్తే... సుమారు 20 ఏళ్ల తర్వాత ఆమె నటించే దక్షిణాది సినిమా ఇదే అవుతుంది. అరవింద్ స్వామికి జోడీగా 1997లో వచ్చిన తమిళ సినిమా ‘మిన్సార కనవు’లో కాజోల్ నటించారు. తెలుగులో ఆ సినిమా ‘మెరుపు కలలు’గా విడుదలైంది.