
బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్- అలియా భట్, జాన్వీ కపూర్.. ఈ ముగ్గురే తన ఫస్ట్ చాయిస్ అంటున్నారు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, దర్శక నిర్మాత కరణ్ జోహార్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను నిర్మించే కరణ్.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. కబీ ఖుషి కబీ గమ్, కుచ్ కుచ్ హోతా హై వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్న కరణ్.. ప్రస్తుతం రేడియో జాకీగా కొత్త అవతారమెత్తారు.
ఈ సందర్భంగా.. 20 ఏళ్ల క్రితం బాలీవుడ్ యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాకు సీక్వెల్ తీస్తే.. క్యాస్టింగ్ విషయంలో మీ అభిప్రాయమేమిటని ఓ అభిమాని కరణ్‌ని ప్రశ్నించాడు. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రణ్‌బీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్‌లతోనే కెకెహెచ్2 ఉంటుందని సమాధానమిచ్చారు. అయితే ఏ పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం రివీల్ చేయలేదు. కాగా షారూక్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కుచ్ కుచ్ హోతా హై ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.