‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్‌ | karthi interview about khaidi | Sakshi
Sakshi News home page

అందరూ ప్రేక్షకులే

Published Mon, Oct 21 2019 1:43 AM | Last Updated on Mon, Oct 21 2019 10:36 AM

karthi interview about khaidi - Sakshi

‘‘నా సినిమా హిట్‌ అయితే ఎందుకు ఆడింది?, ఫ్లాప్‌ అయితే ఎందుకు ఆడలేదు? అని ఎక్కువగా ఆలోచించను. అలా ఆలోచిస్తే కన్‌ఫ్యూజ్‌ అయిపోతాం (నవ్వుతూ). నేనెప్పుడు ఒక్కటే ఫాలో అవుతా. నేను చేసే సినిమా నాకు నచ్చాలి. నాకే నచ్చకపోతే మిగతావాళ్లకు నచ్చాలని ఎలా కోరుకోగలను’’ అని కార్తీ అన్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ పంచుకున్న విశేషాలు...

► ఒక రోజు రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథే ‘ఖైదీ’ సినిమా. పదేళ్ల నుంచి జైల్లో ఉండి విడుదలైన ఖైదీ పాత్రలో కనిపిస్తాను. జైల్లో ఉండటంతో పదేళ్లుగా తన పాపను కూడా చూడలేడు. మొదటిసారి తన కూతుర్ని చూడబోయే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి పాపను చూస్తానా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. పోలీసులు ఉన్నారనే ధీమాతో మనందరం హాయిగా నిద్రపోతున్నాం. పోలీసులు అనేవాళ్లు లేకుంటే పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాం.

► ‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్‌ ఉన్నాయి. అందుకే పాటలు, రొమాన్స్‌  పెట్టలేదు. ఇది ఫుల్‌ మాస్‌ సినిమా. నా పాత్ర ఊరమాస్‌గా ఉంటుంది. సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హీరోలా మారుతుంటుంది. టైటిల్‌ కూడా సూట్‌ అవుతుందని ‘ఖైదీ’ పెట్టాం.

► దర్శకుడు లోకేశ్‌కి ఇది రెండవ సినిమా. ఇంతకు ముందు ‘మానగరం’ సినిమా తెరకెక్కించారు. అంతకు ముందు కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ రూపొందించారు. ‘ఖైదీ’ ఇంటర్నేషన్‌ల్‌ రేంజ్‌ ఫిల్మ్‌. హాలీవుడ్‌ ‘బ్యాట్‌మ్యాన్, సూపర్‌మేన్‌’ సినిమా స్టయిల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం. భవిష్యత్తులో ‘ఖైదీ’ చేశామని కచ్చితంగా గర్వపడతాం.

► ‘విక్రమార్కుడు’ తమిళ రీమేక్‌ చేస్తున్నప్పుడు నాకు ఒక పాప ఉన్నట్టు ఊహించుకొని ఎమోషన్‌ని పండించాలి. అప్పుడు నాకు కూతురు లేదు.. ఇప్పుడు ఉంది. ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కూతురు అనగానే తండ్రికి ఒకలాంటి సంరక్షించే బాధ్యత ఉంటుంది. ఈ భావోద్వేగాన్ని ఈ సినిమాలో చూపించాం.

► ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ వల్ల ప్రపంచ సినిమాను ఫోన్‌లోనే వీక్షిస్తున్నారు. ‘డిజిటల్‌లో కేవలం సిటీ వాళ్లే చూస్తారులే అనుకునేవాణ్ణి’. కానీ, షూటింగ్‌ కోసం ఓ ఊరు వెళితే ‘సార్‌.. ‘మనీ హెస్ట్‌’ షో చూశారా? అని అడుగుతున్నారు. పండగకి రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఏది బావుంటే దాన్ని చూస్తారు. పండగ టైంలో ప్రేక్షకులకు ఆప్షన్స్‌ ఉండాలి. బావుంటే రెండు సినిమాలూ చూస్తారు. ఈ సంక్రాంతికి తమిళంలో విడుదలైన ‘పేట్టా, విశ్వాసం’ రెండూ హిట్‌ అయ్యాయి.

► ఏ పాత్ర అయినా నన్ను చాలెంజ్‌ చేయాలి. ఈ సినిమా కోసం నిజంగానే ఖైదీలను కలిశాం. వాళ్ల నుంచి సమాచారం తీసుకొని నా పాత్రను చేశాను. నా దృష్టిలో అందరూ ప్రేక్షకులే. తెలుగు, తమిళం అని వ్యత్యాసం ఉండదు. రెండు రాష్ట్రాలకు కొన్ని పోలికలు ఉంటాయి.

► జోసెఫ్‌గారి దర్శకత్వంలో వదిన జ్యోతికగారితో ఓ సినిమా చేశాను. అందులో మేమిద్దరం అక్కా తమ్ముడిగా నటించాం. ప్రస్తుతం ‘సుల్తాన్‌’ అనే సినిమా చేస్తున్నాను.

► రజనీకాంత్, విజయ్, అజిత్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ మీతో పని చేసినవాళ్లే. మీరు వాళ్లకు లక్కీ హీరో కదా? అని అడగ్గా – ‘అది నా అదృష్టం. వాళ్లకు ప్రతిభ ఉంది కాబట్టి వరుసగా మంచి సినిమాలు చేస్తున్నారు. ‘ఖైదీ’ టీజర్‌ రాగానే విజయ్‌గారు మా దర్శకుడికి ఫోన్‌ చేసి అవకాశం ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement