
అదే జోరు.. అదే హుషారు
‘బాస్ ఈజ్ బ్యాక్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకుముఖ్య అతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కృషితో, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ఇంత భారీగా వేడుక జరగడం ఇది మొదటిసారి. తొమ్మిదేళ్ల తర్వాత ఓ హీరో మళ్లీ నటించడం అనేది చరిత్రలో మొదటిసారి. ఆయన సినిమా కోసం ఎదురు చూసిన లక్షలాది మెగా ఫ్యాన్స్‌కి సమాధానం ఈ ‘ఖైదీ నంబర్ 150’. ‘ఖైదీ’ రోజుల్లో ఎలా ఉన్నాడో.. అదే విధంగా వచ్చాడు. ఏ ప్రభుత్వాలూ రైతు సమస్యలను పట్టించుకోని పరిస్థితుల్లో.. ప్రజల్ని చైతన్యపరిచిన మనిషి ఈ సినిమాలో హీరో’’ అని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ అభిమానుల్ని చూస్తుంటే కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరంలో ఉన్నానా? అనే అనుమానం కలుగుతోంది.
బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే... నాకు ఓ ఉర్దూ షాహిరిలో చెప్పినట్లు ఈ పదేళ్లు నాకు పది క్షణాల్లా గడిచాయి. పదేళ్ల తర్వాత కూడా పాతికేళ్ల ముందున్న ఊపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి మీరే.. నా తమ్ముళ్లే (అభిమానులు) ఆ శక్తి. 150వ సినిమాగా ఏ సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కత్తి’ చూశా. ఈ కథ అనుకోగానే నాకు మొదట స్ఫురణకు వచ్చిన దర్శకుడు వీవీ వినాయక్. రామ్‌చరణ్ ఈ సినిమాని బాగా నిర్మించాడు. టీమ్ అందరూ కష్టపడి పని చేశారు. ఫంక్షన్ సజావుగా జరగడానికి సహకరించిన ఏపీ పోలీసులకు, ఇతర సిబ్బందికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భం గా విడుదలవుతున్న నా సోదరుడు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’తో పాటు ఏ సినిమా రిలీజైనా సూపర్ హిట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆకాంక్షిం చారు. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సినిమాలు తీయడంలేదు. చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో ఓ సినిమా తీస్తా’’ అన్నారు. తర్వాత దర్శకుడు వినాయక్, నిర్మాత రామ్‌చరణ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నిర్మాత డీవీవీ దానయ్య, ‘ఆదిత్య కన్‌స్ట్రక్షన్’ తోట చంద్రశేఖర్, నటులు బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, రచయితలు పరుచూరి బ్రదర్స్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ‘లహరి మ్యూజిక్’ మనోహర్ తదితరులు హాజరయ్యారు.