ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్, రాజమౌళి, యష్, రవి, సాయి కొర్రపాటి
‘‘కేజీఎఫ్’ సినిమా నిర్మాణంలో మా అబ్బాయి కూడా పాలు పంచుకున్నాడు. ఈ సినిమా పార్ట్ వన్‌తో పాటు రెండో భాగం కూడా పెద్ద విజయాన్ని సాధించాలి. ఈ సినిమా ట్రైలర్ చూడగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. సినిమా ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావిస్తున్నా. సక్సెస్‌కు ట్రైలర్ ఓ నాందిగా అనిపిస్తోంది’’ అని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ అన్నారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కైకాల సత్యనారాయణ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా బిగ్ సీడీ, ఆడియో సీడీలను హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ఉన్నా. దాదాపు 800 సినిమాలు చేశా. కన్నడలో కంఠీరవ రాజ్‌కుమార్ నాకు మంచి మిత్రుడు. యష్ భవిష్యత్‌లో ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగుతాడు’’ అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఓ బస్ డ్రైవర్ కొడుకైన యష్ కన్నడ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయ్యారు.కొడుకు సూపర్‌స్టార్ అయినా తండ్రి ఇంకా బస్ డ్రైవర్‌గానే ఉన్నారు. యష్ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్.. ఆయనకు హ్యాట్సాఫ్. ఈ ఏడాది బెంగళూరుకి ‘ఆర్ ఆర్ ఆర్’ కథా చర్చలకు వెళ్లినప్పుడు యష్ నన్ను కలిసి, ‘కె.జి.ఎఫ్’ విజువల్స్ చూపించారు. వాళ్లు ఈ సినిమా కోసం పడ్డ మూడేళ్ల కష్టం తెలిసింది. ఏ భాష అయినా సినిమా నచ్చితే ఆదరించే ప్రేక్షకులు తెలుగువాళ్లు మాత్రమే.
ఆ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఈ సినిమా తెలుగులోనే కాదు.. ఇండియా అంతటా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు.‘‘మేమంతా ఇక్కడ ఈరోజు నిలబడి ఉన్నామంటే కారణం రాజమౌళిగారు. ఆయన ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు. పెద్దగా కలలు కనండి అని మాకు నేర్పించారు. సినిమాలకు సరిహద్దులను చెరిపేశారు. ఇప్పుడు బడ్జెట్ చిన్న విషయమైపోయింది. విజన్ చాలా పెద్ద విషయంగా నిలుస్తోంది.
కైకాల సత్యనారాయణగారి పేరుని మా పోస్టర్‌పైన వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ నీల్. ‘‘మా ‘కె.జి.ఎఫ్’ సినిమా తెలుగులో భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి కారణం సాయి కొర్రపాటిగారు’’ అన్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. ‘‘సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ రైతు రాజమౌళిగారు. మీ సినిమాలు బావుంటే మేం సపోర్ట్ చేస్తాం. మా చిత్రాలు బావుంటే మీరు సపోర్ట్ చేయండి’’ అని యష్ అన్నారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఎన్వీ ప్రసాద్, సాయి కొర్రపాటి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్ భువన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment