
చిరంజీవి 150వ సినిమాకు కొత్త అడ్డంకులు?
మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా రీ ఎంట్రీ సినిమాపై కసరత్తులు చేస్తున్న చిరంజీవి, ఇటీవలే తమిళ సూపర్ హిట్ సినిమా 'కత్తి'ని రీమేక్ చేయాలని నిర్ణయించారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా నిర్మాణంపై కథా హక్కుల వేదిక ఆంక్షలు విధించింది. కత్తి కథ తనదేనంటూ రచయిత ఎన్ నరసింహారావు పోరాడుతుండటంతో ఆయనకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేపట్టాలని కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానించారు. అప్పటివరకు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయడానికి నిర్ణయించారు.
మురుగదాస్ స్వయంగా రాసుకొని తెరకెక్కించిన కత్తి కథను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మెగా క్యాంప్ చెపుతోంది. ఈ సినిమాను తమిళ్లో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్, తెలుగులోనూ నిర్మిస్తుండటంతో హాక్కుల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. మరి ఇలాంటి సమయంలో కథా హక్కుల వేదిక ఆంక్షలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.